మెల్బోర్న్: ముంబైకి చెందిన యువ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్‌కు భారత జట్టులో చోటు దక్కింది. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో తనుష్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగబోయే చివరి రెండు టెస్టుల కోసం అతడు జట్టులోకి వచ్చాడు. మంగళవారం తనుష్ మెల్బోర్న్కు పయనమయ్యే అవకాశమున్నట్టు బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు.
చివరి రెండు టెస్టులకు గాను తనుష్.. జడేజా, వాషింగ్టన్కు బ్యాకప్‌గా ఉండనున్నాడని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకైనా అందుబాటులో ఉంటాడనుకున్న భారత పేసర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో గాయమై కొద్దిరోజుల క్రితమే కోలుకున్న అతడు దేశవాళీల్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఫిట్నెస్ నిరూపించుకునేందుకు శ్రమిస్తున్న షమీ.. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో ఆడి రాణించాడు. కానీ ఈ టోర్నీ అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షలలో అతడి ఎడమ మోకాలికి గాయమైందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో బీజీటీలో షమీ ఆడతాడని ఆశించిన అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.