డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో స్వర్ణం దక్కింది. టేబుల్ వాల్ట్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో రాష్ర్టానికి చెందిన నిషిక అగర్వాల్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. బుధవారం జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో నిషిక.. 12.717 పాయింట్లు స్కోరు చేసి పసిడి కైవసం చేసుకుంది.
నిషికతో పాటు యువ రెజ్లర్ నిఖిల్ యాదవ్ జాతీయ క్రీడల్లో కాంస్యంతో సత్తా చాటాడు. 65 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో అతడు కాంస్యం గెలిచాడు. కర్నాటక రెజ్లర్ మహేశ్‌పై 12 పాయింట్ల టెక్నికల్ సుపీరియారిటీతో నిఖిల్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు. ఇక మిక్స్డ్ నెట్‌బాల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ.. 38-31తో ఉత్తరాఖండ్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. ఇప్పటిదాకా ఈ క్రీడల్లో తెలంగాణకు 3 స్వర్ణాలు, 3 రజతాలతో పాటు 10 కాంస్య పతకాలు దక్కాయి.