హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గురుకుల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ తమదైన ప్రతిభ చాటుతున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ అద్భుతాలు సృష్టిస్తామంటూ చేతల్లో నిరూపిస్తున్నారు. మహాత్మ జ్యోతిబా పులే పాఠశాల(చార్మినార్) విద్యార్థి మౌనిక జాతీయ స్థాయి షూటింగ్లో సత్తాచాటుతున్నది. ఇటీవల భోపాల్ వేదికగా జరిగిన 65వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో ఈ యువ షూటర్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తద్వారా అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత దక్కించుకుంది. ఈ విషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాములు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షూటింగ్ లో రాణిస్తున్న మౌనిక ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు, గురుకుల ఉపాధ్యాయులు అభినందించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికితీసేందుకు క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కీసర బీసీ గురుకుల పాఠశాలలో రైఫిల్ షూటింగ్ శిక్షణ ప్రారంభించారు. ఆసక్తి కల్గిన 25 మంది విద్యార్థులకు కోచ్ సహాయంతో శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న మౌనిక ప్రతిభను గుర్తించిన సిబ్బంది తొలుత రాష్ట్రస్థాయి పోటీలకు పంపారు. అలా టోర్నీటోర్నీకి మెరుగైన మౌనిక జాతీయస్థాయికి ఎదిగింది.