అద్భుతం ఆవిష్క్రుతమైంది! ప్రపంచ చదరంగంపై భారత మువ్వన్నెల పతాకం సగర్వంగా రెపరెపలాడింది. అంచనాలకు మించి రాణిస్తూ అతి పిన్న వయసులో(18 ఏండ్లు)నే భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చాంపియన్ కిరీటం కైవసం చేసుకున్నాడు. ఆఖరి గేమ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను మట్టికరిపించాడు. ప్రత్యర్థి పొరపాటును తనకు అనుకూలంగా మలుచుకుని ప్రపంచ టైటిల్‌ను ముద్దాడాడు. ఆరాధ్య ఆటగాడు, దిగ్గజ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మెగాటోర్నీ గెలిచిన రెండో భారతీయుడిగా గుకేశ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఆశలు లేని స్థితి నుంచి అద్భుతాన్ని సృష్టిస్తూ గుకేశ్ సాధించిన విజయానికి దేశం యావత్తు గర్వంతో ఉప్పొంగిపోయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ మొదలు పలువురి ప్రముఖుల ప్రశంసలతో గుకేశ్ తడిసిముద్దయ్యాడు.
సింగపూర్: భారత చదరంగ చరిత్రలో నూతన అధ్యాయం. 64 గళ్ల గేమ్‌లో దేశ ఖ్యాతిని మరింత ద్విగుణికృతం చేస్తూ దొమ్మరాజు గుకేశ్ కొత్త చరిత్ర లిఖించాడు. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌ను చిత్తు చేస్తూ ప్రతిష్ఠాత్మక చెస్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గురువారం జరిగిన ఆఖరిదైన 14వ గేమ్‌లో నల్లపావులతో బరిలోకి దిగిన ఈ 18 ఏండ్ల కుర్రాడు..లిరెన్(6.5)ను కట్టిపడేస్తూ 7.5 పాయింట్లతో టైటిల్ ఒడిసిపట్టుకున్నాడు. గేమ్‌కు ముందు ఇద్దరు 6.5 పాయింట్లతో సమంగా ఉండగా, విజేతను నిర్ణయించే ఈ పోరులో గుకేశ్‌కు అదృష్టం కలిసోచ్చింది. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఫైనల్ గేమ్ పోరు 58 ఎత్తుల్లో ముగిసింది. అప్పటి వరకు కనీసం డ్రా కోసమైనా ప్రయత్నం చేద్దామనుకున్న గుకేశ్‌కు లిరెన్ చేసిన ఘోర తప్పిదం ప్రపంచ విజేతగా నిలిచేలా చేసింది.
55 ఎత్తులో లిరెన్ వేసిన తప్పటడుగుతో ఒకింత ఆశ్చర్యపోయిన గుకేశ్ గేమ్‌ను మరో మూడు ఎత్తుల్లోనే ముగించి తన కలను సాకారం చేసుకున్నాడు. విజయం తనదేని భావించిన ఈ కుర్రాడు..ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో ఉబికి వస్తున్న కన్నీటిని రెండు చేతులతో ఆపుకుంటూ విజయాన్ని ఆస్వాదించాడు. గేమ్ ముగిసిన తర్వాత అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించాడు. సుదీర్ఘ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ చరిత్రలో టైటిల్ గెలిచిన పిన్న వయసుగా ప్లేయర్‌గా గ్యారీ కాస్పరోవ్(22 ఏండ్లు, రష్యా) రికార్డును చెరిపేస్తూ గుకేశ్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. దీనికి తోడు ఐదు సార్లు ప్రపంచ విజేత విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రతిష్ఠాత్మక టైటిల్ గెలిచిన రెండో భారత ప్లేయర్‌గాను నిలిచాడు. టైటిల్ సొంతం చేసుకున్న గుకేశ్‌కు రూ.11.34 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. సరిగ్గా 10 ఏండ్ల క్రితం 2013లో భారత్ నుంచి ప్రపంచ చెస్ టోర్నీలో ఆనంద్ విజేతగా నిలిచాడు.
గత 10 ఏండ్లుగా ఈ చిరస్మరణీయ విజయం కోసం ఎదురుచూస్తున్నాను. కల సాకారం కావడం చాలా సంతోషంగా ఉంది. గెలుపు ఆసలు ఊహించలేదు అందుకే ఒకింత ఉద్వేగానికి గురయ్యాను. ప్రతీ ప్లేయర్ ఇలాంటి కల కోసం ఎదురుచూస్తాడు. క్యాండిడేట్స్ టోర్నీ నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్ వరకు నా వెన్నంటి నిలిచిన భగవంతునికి కృతజ్ఞతలు. 2013లో విశీసార్(ఆనంద్), కార్ల్సన్ మధ్య పోరు టీవీలో చూశాను. ఆ టోర్నీలో కార్ల్సన్ గెలువడంతో ఎలాగైనా ప్రపంచ టైటిల్‌ను భారత్‌కు తిరిగి తీసుకురావాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. కార్ల్సన్ అంత స్థాయికి ఎదుగాలనుకుంటున్నాను. లిరెన్ నిజమైన ప్రపంచ చాంపియన్. అతని పోరాట పటిమ అమోఘం.నా విజయంలో మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్ పాత్ర చాలా విలువైనది. 12 గేమ్ తర్వాత నాకు సరైన నిద్ర లేదు. ఈ సమయంలో ప్యాడీని సంప్రదించడం కలిసొచ్చింది.
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన పిన్న వయసు ప్లేయర్‌గా నిలిచిన గుకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు. అతని ప్రదర్శనతో భారత్ గర్వపడుతున్నది. మెగాటోర్నీలో అతని విజయం చెస్‌లో భారత్ పవర్‌హౌజ్ అని నిరూపిస్తున్నది. వెల్డన్ గుకేశ్! ప్రతీ భారతీయుని తరఫున భవిష్యత్‌లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను
చిరస్మరణీయ విజయం సాధించిన గుకేశ్‌కు శుభాకాంక్షలు. ఈ ఫలితం అతని అద్భుతమైన ప్రతిభ, హార్డ్‌వర్క్, సాధించాలన్న పట్టుదలకు నిదర్శనం. ఈ విజయంతో చెస్ చరిత్రలో అతని పేరు చిరకాలం నిలిచిపోవడమే కాదు, కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అతని భవిష్యత్ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నాను