ఢిల్లీ : ఐపీఎల్లో మరో పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన మ్యాచ్‌లో ఢిల్లీపై గుజరాత్‌దే పైచేయి అయ్యింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో గుజరాత్ ఒక పరుగు తేడాతో ఢిల్లీపై ఉత్కంఠ విజయం సాధించింది. టైటాన్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 209/8 స్కోరు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 92, 11ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఒంటరిపోరాటం చేయగా, ఆఖర్లో మిల్లర్(20 బంతుల్లో 41నాటౌట్, 3ఫోర్లు, 3సిక్స్‌లు) గెలుపు ప్రయత్నాలు ఫలించలేదు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో తొలి బంతిని ఫోర్ కొట్టిన నిగమ్ మరుసటి బంతికే ఔటయ్యాడు.
మూడో బంతికి కుల్దీప్ సింగిల్ తీయగా, నాలుగో బంతిని మిల్లర్ భారీ సిక్స్‌తో స్టేడియం బయటికి పంపాడు. దీంతో సమీకరణం కాస్తా రెండు బంతుల్లో రెండింటికి మారింది. ఐదో బంతికి పరుగు తీయలేకపోయిన మిల్లర్..ఆఖరి బంతిని షాట్ ఆడటంలో విఫలమై కుల్దీప్ రనౌట్‌కు కారణమయ్యాడు. కీపర్ బట్లర్ విసిరిన త్రో వికెట్లకు తాకగా, ఈ సీజన్లో గుజరాత్ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత ఓవర్లకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 210 రన్స్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (45 బంతుల్లో 70, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (27 బంతుల్లో 52, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.
టాపార్డర్ రాణించడంతో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన టైటాన్స్ అదరగొట్టింది. నిలకడగా ఆడే సాయి సుదర్శన్ (12)ను ముకేశ్ మూడో ఓవర్లోనే పెవిలియన్‌కు పంపినా బట్లర్, సుందర్ అండతో కెప్టెన్ గిల్ స్ఫూర్తిధాయక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో నెమ్మదిగా మొదలెట్టి క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపించే అలవాటున్న అతడు.. అదే సూత్రాన్ని ఫాలో అయ్యాడు. సాయి నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్.. పవర్ ప్లేలో ఢిల్లీ బౌలర్లపై శివాలెత్తాడు. ముకేశ్ ఐదో ఓవర్లో 6, 6, 4, 6తో 23 రన్స్ పిండుకున్న అతడు.. అక్షర్ బౌలింగ్‌లో డబుల్‌తో 24 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేశాడు. కానీ కుల్దీప్ తన తొలి ఓవర్లోనే బట్లర్‌ను బౌల్డ్ చేసి క్యాపిటల్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. బట్లర్ ఔట్ అయ్యేసరికి (8 ఓవర్లకు) 14 పరుగులే చేసిన జీటీ సారథి.. కుల్దీప్ బౌలింగ్‌లో సిక్స్‌తో గేర్ మార్చాడు. విప్రాజ్ 12వ ఓవర్లో సుందర్ రెండు ఫోర్లు, సిక్స్ బాదగా గిల్ సైతం బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన గిల్.. కుల్దీప్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో జోరు పెంచాడు. కానీ ఎంగిడి తన ఆఖరి ఓవర్లో గిల్‌ను ఔట్ చేయడంతో 104 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో వాషింగ్టన్ మెరుపులతో జీటీ 200 పరుగుల మార్కును దాటింది.

ఢిల్లీ ఛేదన ధాటిగానే ఆరంభమైనా మధ్యలో తడబాటుకు గురైన ఆ జట్టును రాహుల్, మిల్లర్ ఆదుకున్నారు. ఓపెనర్లు పతుమ్ నిస్సంక (24 బంతుల్లో 41, 6 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తొలి వికెట్‌కు 76 రన్స్ జోడించి గట్టి పునాధి వేశారు. సిరాజ్ తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు కొట్టిన నిస్సంక.. అశోక్ విసిరిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో 4, 6, 4, 4తో రెచ్చిపోయాడు. ప్రసిద్ధ్ తన రెండో ఓవర్లో తొలి బంతికే నిస్సంకను పెవిలియన్ చేర్చినా మిగిలిన ఐదు బంతుల్లో రాహుల్ రెండేసి ఫోర్లు, సిక్స్‌లతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. అయితే రషీద్ పదో ఓవర్ వరుస బంతుల్లో నితీశ్ రాణా (5), సమీర్ రిజ్విని డకౌట్ చేయడంతో క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మిల్లర్‌తో జతకలిసిన రాహుల్…జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే గాయంతో మిల్లర్ రిటైర్‌హర్ట్‌గా వెనుదిరుగగా, క్రీజులోకి వచ్చిన స్టబ్స్(7) అనుకోని రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ 17వ ఓవర్లో చివరి బంతికి రాహుల్ ఔట్ కావడంతో సమీకరణం 18 బంతుల్లో 45కు చేరుకుంది. 19వ ఓవర్లో సిరాజ్‌ను మిల్లర్ 6, 4,6 కొట్టడంతో 23 పరుగులు వచ్చి చేరాయి. చివర్లో ఛ్ల్లర్ స్రిన
గుజరాత్ : 20 ఓవర్లలో 210/4 (గిల్ 70, వాషింగ్టన్ 55, ముకేశ్ 2/55, ఎంగిడి 1/24);
ఢిల్లీ: 20 ఓవర్లలో 209/8(రాహుల్ 92, మిల్లర్ 41 నాటౌట్, రషీద్ 3/17, ప్రసిద్ధ్ 2/52)
