బెంగళూరు: వరుసగా రెండు ఓటముల తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో గుజరాత్ జెయింట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్.. 6 వికెట్ల తేడాతో నెగ్గింది. బంతితో సమిష్టిగా రాణించిన గుజరాత్.. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని నిర్ణీత 20 ఓవర్లలో 125/7 కే కట్టడిచేసింది. కనిక అహుజా (28 బంతుల్లో 33, 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా రఘ్వి బిస్త్ (22), జార్జియా వర్హెమ్ (20 నాటౌట్) ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు సాయపడ్డారు.
గుజరాత్ బౌలర్లలో తనూజా కన్వర్ (2/16), డియాండ్ర డాటిన్ (2/31), కాశ్వీ గౌతమ్ (1/17) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఈ సీజన్లో దూకుడుమీదున్న బెంగళూరు స్టార్ బ్యాటర్ ఎలీస్ పెర్రీ డకౌట్ అయింది. డబ్ల్యూపీఎల్‌లో 22 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమెకు డకౌట్ అవడం ఇదే ప్రథమం. జెయింట్స్.. 16.3 ఓవర్లలోనాలుగు వికెట్లు కోల్పోయి ఛేదనను పూర్తిచేసింది. మూనీ (17), డియోల్ (5) నిరాశపరిచినా ఆ జట్టు సారథి ఆష్లీ గార్డ్నర్ (31 బంతుల్లో 58, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను విజయపథాన నిలిపింది. లిచ్‌ఫీల్డ్ (30 నాటౌట్) ఆమెకు అండగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూరుకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇది వరుసగా మూడో ఓటమి.