WPL | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా వచ్చే ఏడాది జరుగబోయే వేలానికి ముందే ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలోని గుజరాత్ జెయింట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. 19 మంది సభ్యులుండే టీమ్‌ను ప్రక్షాళన చేసింది. గత సీజన్లో ఆడినవారిలో ఎనిమిది మందిని మాత్రమే రిటైన్ చేసుకుని.. 11 మందికి ఉద్వాసన పలికింది. ఈ మేరకు బీసీసీఐ ఐదు జట్లూ రిటైన్, రిలీజ్ చేసిన ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది.
గత సీజన్లో ప్రాతినిథ్యం వహించినవారిలో ఐదు జట్లూ మొత్తంగా 89 మందిలో 60 మందిని రిటైన్ చేసుకుని 29 మందిని రిలీజ్ చేశాయి. గుజరాత్ జెయింట్స్‌లో ఆసీస్ త్రయం అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, జార్జియా వర్హెమ్తో పాటు సోఫీఇయా డంక్లీని కూడా పక్కనబెట్టింది. గత సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి గాయంతో దూరమైన కెప్టెన్ బెత్ మూనీని మాత్రం రిటైన్ చేసుకుంది. ఆ జట్టుకు అత్యధికంగా పది స్లాట్స్ అందుబాటులో ఉండగా.. వారిలో ముగ్గురు ఫారెనర్స్ను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ జట్టు ఖాతాలో రూ. 5.95 కోట్ల నగదు ఉంది. బెత్ మూనీతో పాటు ఆష్లే గార్డ్నర్, డయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్ట్, షబ్నం షకీల్, స్నేహ్ రాణా, తనూజా కన్వర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది.
Delhi Capitals, UP Warriorz and Gujarat Giants Women’s teams Retained and Released players in WPL 2024. pic.twitter.com/tQJIwUilbY
— CricketMAN2 (@ImTanujSingh) October 19, 2023
గత సీజన్లో అంచనాలకు మించి రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ పదిహను మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అపర్ణా మండల్, జసియా అక్తర్, తారా నోరిస్లను రిలీజ్ చేసింది. ఢిల్లీ ఖాతాలో రూ. 2.25 కోట్ల నగదు ఉంది. ఇక తొలి సీజన్ విజేత ముంబై ఇండియన్స్‌తో పాటు మూడో స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్‌లు పదమూడు మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. యూపీ ఖాతాలో రూ. 4, కోట్లు ఉండగా ముంబై వద్ద రూ. 2.1 కోట్ల నగదు ఉంది. ఆ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శనతో ఆఖరు స్థానంలో నిలిచిన స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడుగురు ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. ఆర్సీబీ ఖాతాలో రూ. 3.35 కోట్లు ఉన్నాయి.