ఈ ఐపీఎల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు ఘోర పరాజయం. పంజాబ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి చవి చూసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాండ్యాకు బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారం అందలేదు. అతను కూడా ఒక్క పరుగుకే అవుటయ్యాడు.
ఈ క్రమంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్ (64 నాటౌట్), సాహా (21) మాత్రమే రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు కూడా ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన జానీ బెయిర్‌స్టో (1) తీవ్రంగా నిరాశపరిచాడు.
అయితే ఆ తర్వాత ధవన్ (62 నాటౌట్)కు జతకలిసిన రాజపక్స (40) చక్కని ఇన్నింగ్స్ నిర్మించాడు. ఫెర్గూసర్ బౌలింగ్‌లో రాజపక్స అవుటైన తర్వాత వచ్చిన లియామ్ లివింగ్స్టన్ (10 బంతుల్లో 30 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు.
అదే ఓవర్లో మరో రెండు బౌండరీలతో జట్టుకు సునాయాస విజయం అందించాడు. దీంతో పంజాబ్ జట్టు మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ను చిత్తుచేసింది. ఇది ఈ సీజన్లో గుజరాత్‌కు రెండో ఓటమి. గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గూసన్ చెరో వికెట్ తీసుకున్నారు.