అమీర్‌పేట్, జూలై 15: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ పత్రంలో తప్పనిసరిగా ప్రకటించాల్సిన 2002లో ఓటు వేశారా, వేస్తే ఎక్కడ? అనే విషయం ప్రజల్లో తీవ్ర అయోమయానికి దారితీస్తోందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సనత్‌నగర్ డివిజన్లోని సుభాష్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సర్ హెల్ప్ డెస్క్‌ను తలసాని సందర్శించారు. హెల్ప్ డెస్క్ ద్వారా ఓటర్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సర్ ఫారాల పంపిణీ, నింపే విధానంపై అవగాహన కల్పించడంలో బీఎల్వోలు, హెల్ప్ డెస్క్ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని తలసాని విమర్శించారు.
అవగాహన లేని సిబ్బందితో సర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో బూత్‌లో కనీసం 900 నుంచి 1400 వరకు ఓట్లున్నాయని, సర్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలంటే కనీసం నలుగురు సభ్యులతో కూడిన బృందం పనిచేయాల్పి ఉంటుందన్నారు. వివిధ శాఖలకు చెందిన సిబ్బందిని ఈ సర్ ప్రక్రియ నిర్వహణకు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, పుట్టల శుఖర్, సురేష్‌గౌడ్, రాజేష్ ముదిరాజ్, కరుణాకర్‌రెడ్డి, దాడి ప్రవీణ్‌రెడ్డి, రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
