HomeSportsGt Vs Mi Mumbai Registers A Thrilling Win Over Gujarat Titans
GT vs MI | ముంబై సూపర్ విక్టరీ.. గుజరాత్‌కు వరుసగా రెండో ఓటమి
ఈ ఐపీఎల్ సీజన్లో దూసుకుపోతున్న టేబుల్ టాపర్స్ గుజరాత్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఓపెనర్లు రోహిత్, కిషన్‌తోపాటు చివర్లో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడటంతో 177 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు సాహా (55), గిల్ (52) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు.
హార్దిక్ పాండ్యా (24) కాసేపు బాగానే ఆడినా రనౌట్ అయ్యి వెనుతిరిగాడు. మంచి టచ్‌లో కనిపించిన సాయి సుదర్శన్ (14).. చెయ్యి జారి బ్యాటు వికెట్లను తాకింది. దీంతో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. రాహుల్ తెవాటియా (3) కూడా రనౌట్ అయ్యాడు. కానీ క్రీజులో డేవిడ్ మిల్లర్ (19 నాటౌట్) ఉండటంతో గుజరాత్ విజయంపై ధీమాగా కనిపించింది.
చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు చేయాల్సిన స్థితిలో 19వ ఓవర్ వేసిన బుమ్రా.. 11 పరుగులు ఇచ్చాడు. దాంతో గుజరాత్ జట్టు గెలుపు కోసం ఒక ఓవర్లో 9 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో మూడంటే మూడు పరుగులే ఇచ్చిన డానియల్ శామ్స్.. ముంబైకి విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి బంతికి ఆరు పరుగులు కావలసిన తరుణంలో శామ్స్ డాట్ బాల్ వేయడంతో ముంబై జట్టు విజయోత్సవాల్లో మునిగిపోయింది.
గుజరాత్ అభిమానులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐదు పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ 2 వికెట్లు తీయగా.. పొలార్డ్ ఖాతాలో ఒక వికెట్ చేరింది.