D Gukesh : చందరంగం అంటేనే బుర్రకు పనిచెప్పే ఆట. 64 గడుల ఆటలో ఆరితేరిన యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్(D Gukesh) వరల్డ్ క్లాస్ ప్లేయర్‌గా అవతరించాడు. అద్భుత విజయాలతో ఆశ్చర్యపరుస్తున్న గుకేశ్ ఈమధ్యే ఫిడే చెస్ ఒలింపియాడ్ (FIDE Chess Olympiod)లోనూ సత్తా చాటాడు. భారత బృందం స్వర్ణ చరిత్రలో భాగమైన అతడు ఇప్పుడు ఓ డ్యాన్స్ వీడియోతో వైరల్ అవుతున్నాడు. టోర్నీల నుంచి విరామం దొరకడంతో అతడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హిట్ పాటకు స్టెప్పులేశాడు.
‘వెట్టయాన్’ సినిమాలోని ‘మనసిలాయో'(Manasilaayo) సాంగ్‌కు గుకేశ్ డ్యాన్స్‌తో దుమ్మురేపాడు. ఎరుపు రంగు కుర్తా ధరించి.. కళ్ల జోడు పెట్టుకొని తన స్నేహితులతో పాటు ఉత్సాహంగా స్టెప్పులు వేశాడు. ఈ వీడియోతో గ్రాండ్‌మాస్టర్ తనలోని డ్యాన్సర్‌ను అందరికీ పరిచయం చేశాడు. గుకేశ్ ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. అంతే.. క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయింది. గుకేశ్ డ్యాన్స్ చూసిన వాళ్లంతా.. ‘చదరంగలోనే కాదు డ్యాన్స్‌లోనూ నువ్వు తోపువే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత పురుషుల బృందం చరిత్ర సృష్టించింది. నల్ల పావులతో ఆడిన గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్(D.Gukesh) రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై అద్భుత విజయంతో దేశానికి బంగారు పతకం సాధించి పెట్టాడు. టోర్నీ ఆసాంతం గుకేశ్‌తో పాటు హైదరాబాద్ కుర్రాడు అర్జున్ ఎరిగేసి(Arjun Erigesi) అదరగొట్టాడు. గ్రాండ్‌మాస్టర్, ఆర్ ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, పీ హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్(కెప్టెన్)లు సైతం అద్భుతంగా రాణించారు.
రెండేండ్లకు ఓ సారి జరిగే ఈ టోర్నీలో 2022 లోకాంస్యంతో సరిపెట్టుకున్న భారత్‌కు ఈసారి స్వర్ణం దక్కడం గమనార్హం. 2014లోనూ ఇండియా కంచు మోత మోగించింది. మహిళల విభాగంలోనూ ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి. దివ్యా దేశ్‌ముఖ్, వంతికా అగర్వాల్, తానియా సచ్దేవ్ బృందం చెస్ ఒలింపియాడ్‌లో పసిడితో నవశకానికి నాంది పలికింది. 44వ ఒలింపియాడ్‌లో కాంస్యానికే పరిమితమైన అమ్మాయిలు ఈసారి సంచలన ఆటతో పసిడి వెలుగులు విరజిమ్మారు.