సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగే ఆటగాళ్ల వేలానికి ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్( Glenn Maxwell) దూరం అయ్యారు. క్రికెటర్ల వేలానికి అందుబాటులో ఉండడం లేదని ఆసీస్ బ్యాటర్ ఇవాళ ప్రకటించాడు. డిసెంబర్ 16వ తేదీన అబుదాబిలో ఐపీఎల్ ప్లేయర్ల వేలం జరగనున్నది. అయితే ఐపీఎల్లో అతను 2012 సీజన్ నుంచి ఆడుతున్నాడు. హిట్టర్‌గా పేరుగాంచిన మ్యాక్స్‌వెల్ 2019 సీజన్లో మాత్రం ఆడలేదు. ఇక అతను 141 మ్యాచుల్లో కేవలం 2819 రన్స్ మాత్రమే చేవాడు. అతనికి స్ట్రయిక్ రేట్ 155 ప్లస్‌గా ఉన్నది. బ్యాటింగ్ యావరేజ్ 24గా ఉంది. అయితే ఐపీఎల్ వేలంలో అతనికి ఫ్రాంచైజీలు ఎక్కువే సమర్పిస్తున్నా.. మ్యాక్స్‌వెల్ మాత్రం ఆశించిన రీతిలో సక్సెస్ సాధించలేదు. స్పిన్ బౌలింగ్ వేసే మ్యాక్స్‌వెల్ .. ఐపీఎల్లో కేవలం 41 వికెట్లు తీసుకున్నాడు.
ఐపీఎల్లో ఎన్నో మరుపురాని సీజన్స్ ఆడానని, అయితే ఈ ఏడాది జరిగే ఆటగాళ్ల వేలానికి తమ పేరును సమర్పించడం లేదని మ్యాక్స్‌వెల్ తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రకటించాడు. తాను తీసుకున్నది పెద్ద నిర్ణయమని, ఐపీఎల్ లీగ్ తనకు ఎంతో పేరుప్రఖ్యాతలు తీసుకువచ్చిందన్నారు. ఓ క్రికెటర్‌గా, ఓ వ్యక్తిగా తనను ఐపీఎల్ తీర్చిదిద్దినట్లు మ్యాక్స్ తన ఇన్‌స్టా పేజీలో చెప్పాడు.
ఐపీఎల్లో మొత్తం 13 సీజన్లు ఆడాడు మ్యాక్స్‌వెల్. వాటిల్లో 2021 సీజన్లో అతను 500 స్కోరు దాటాడు. ఆ సీజన్లో అతను ఆరు అర్థశతకాలు చేశౄడు. 144 ప్లస్ స్ట్రయిక్ రేట్ ఉన్నది. గడిచిన రెండు సీజన్లలో, అంటే 2024, 2025లో మ్యాక్సీ పర్ఫార్మెన్స్ మరీ దారుణంగా పడిపోయింది. రెండు సీజన్లలో అతను 17 మ్యాచుల్లో కేవలం వంద రన్స్ మాత్రమే చేశాడు. 2024లో 52, 2025లో 48 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. గత సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత స్వదేశం వెళ్లిన మ్యాక్సీ మళ్లీ వెనక్కి రాలేదు.