Layoffs | జర్మనీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ వియర్ బ్రాండ్ పూమా బుధవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి 900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మార్చిలో ప్రకటించిన ఖర్చులను తగ్గించే కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 500 మంది ఉద్యోగులను తొలగించింది. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్థర్ హోయెల్డ్ ఆధ్వర్యంలో కంపెనీ పనితీరును మెరుగుపరుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు పేర్కొంది. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడం, సుంకాల ప్రభావంతో కంపెనీ లాభాలు తగ్గాయి. మూడో త్రైమాసికంలో కరెన్సీ సర్దుబాటు ప్రాతిపదికన అమ్మకాలు 10.4శాతం తగ్గాయని కంపెనీ చెప్పింది. ఇది కంపెనీ అందించిన పోల్లో విశ్లేషకులు అంచనా వేసిన 1.98 బిలియన్ల కంటే కొంచెం తక్కువ.
ఇదిలా ఉండగా.. పునర్నిర్మాణంలో అమెజాన్ భారత్లో 800 మంది నుంచి వెయ్యి మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లుగా ది ఎకనామిక్ టైమ్స్ (ET) ఓ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఖర్చులను తగ్గించుకునేందుకు కృత్రిమ మేధస్సు (AI)పై దృష్టి సారించింది. ఈ తొలగింపులు అమెజాన్ ఇండియాలోని ఆర్థిక, మానవ వనరులు, టెక్నాలజీ సహా మల్టిపుల్ విభాగాలను ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ ఈటీ కథనం వెలువరించింది. ఉద్యోగాలు కోల్పో ఉద్యోగులు గ్లోబల్ టీమ్ కింద పని చేసేవారని సమాచారం.