South Africa Pacer : తొలి వరల్డ్ కప్ ట్రోఫీ కోసం ఏండ్లుగా నిరీక్షిస్తున్న దక్షిణాఫ్రికా(South Africa) ఈసారి కలను నిజం చేసుకునేలా కనిపిస్తోంది. శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్‌పై గెలుపొంది.. ఆస్ట్రేలియాతో సెమీస్ ఫైట్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో సఫారీ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ(Grald Coetzee) రికార్డు బద్ధలు కొట్టాడు. మెగా టోర్నీలో 18 వికెట్లు ఖాతాలో వేసుకున్న ఈ స్పీడ్‌స్టర్.. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్రొటియస్ పేసర్‌గా నిలిచాడు.
గతంలో ఈ రికార్డు లాన్సే క్లూసేనర్(Lance Clusenar) పేరిట ఉండేది. 1999 ఎడిషన్‌లో క్లూసెనర్ 17 వికెట్లతో నెలకొల్పిన రికార్డును మోర్నీ మోర్కెల్(Morne Morkel) 2015లో సమం చేశాడు. మార్కో జాన్సేన్( marco jansen) 2019 వరల్డ్ కప్‌లో 17 వికెట్లతో ఈ ఫీట్ సాధించిన మూడో సఫారీ పేసర్‌గా నిలిచాడు.
సఫారీ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ
ఈ ఏడాది జాతీయ జట్టులోకి వచ్చిన కోయెట్జీ నిలకడగా రాణిస్తూ వరల్డ్ కప్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. ఈ రైటార్మ్ పేసర్ ఊహించినట్టుగానే సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వికెట్ల వేట కొనసాగిస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
భారత్ ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడుతోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ నుంచి ఏడో స్థానంలో వచ్చే జాన్సేన్ వరకూ అందరూ దంచి కొడుతూ భారీ స్కోర్ అందిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో రబాడ, ఎంగిడి, జాన్సేన్, కోయెట్టీ ప్రత్యర్థులను బెంబేలిస్తున్నారు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్, షంసీ పొదుపైన బౌలింగ్‌తో కట్టడిచేస్తుండడంతో సఫారీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. బవుమా సేన నవంబర్ 16న కోల్‌కతా వేదికగా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.