బాలీ (ఇండోనేషియా) : అంతర్జాతీయ టీ20 ల్లో మరో సరికొత్త రికార్డు నమోదైంది. కంబోడియాతో జరిగిన పొట్టి పోరులో ఇండోనేషియా పేసర్ జెడె ప్రియందన(1-0-1-5) ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. మంగళవారం జరిగిన పోరులో ప్రియందన ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇండోనేషియా 60 పరుగుల తేడాతో కంబోడియాపై ఘన విజయం సాధించింది. ఎనిమిది మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి పోరులో యువ పేసర్ ప్రియందన రికార్డు ప్రదర్శనతో అదరగొట్టాడు. 168 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కాంబోడియా..ప్రియందన పేస్ ధాటికి 16 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది.
ఏడో బౌలర్గా వచ్చిన 28 ఏండ్ల ప్రియందన..షా అబ్రార్ హుస్సేన్(37), నిర్మల్జీత్సింగ్(0), చంతోని రతానక్(0)ను వరుసగా బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ మిగతా మూడు బంతుల్లో మొంగ్దర సోక్(0) పెల్ వానెక్(0)ను ఔట్ చేసి ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు ఓవరాల్గా టీ20ల్లో ఈ రికార్డు అల్అమిన్ హుస్సేన్, అభిమన్యు మిథున్ పేరిట ఉంది.