Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్(Head Coach) పదవిపై ప్రతిష్టంభన నెలకొంది. మే 27తో దరఖాస్తు గడువు తేదీ ముగిసినా ఎవరెవరు పోటీలో ఉన్నారు? అనే విషయంపై బీసీసీఐ(BCCI) ఎలాంటి
ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ (Gautam Gambhir) కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా కోచ్‌గా గంభీర్ నియామకం జరిగిపోయిందని, అధికారిక ప్రకటనే తరువాయి అని అందరూ అనుకుంటున్నారు.
అందుకు కారణం లేకపోలేదు. బీసీసీఐ పెద్దలకు సన్నిహితుడైన ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమాని ఒకరు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. భారత పురుషుల సీనియర్ జట్టు కోచ్‌గా గంభీర్ సెలెక్ట్ అయ్యాడని చెప్పాడట. దాంతో, అది కచ్చితంగా నిజమయ్యే చాన్స్ ఉందని అనిపిస్తోంది. టీమిండియా ఓపెనర్‌గా అదరగొట్టిన గంభీర్ 2011 వరల్డ్ కప్(ODI World Cup)గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అనంతరం ఐపీఎల్లో గౌతీ కెప్టెన్‌గా తన ముద్ర వేశాడు.
ఏడు సీజన్లు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు గంభీర్ సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలోనే కోల్‌కతా 2012, 2104లో చాంపియన్‌గా నిలిచింది. మళ్లీ గంభీర్ మెంటార్‌గా వచ్చాకే కోల్‌కతా మూడో టైటిల్ కొల్లగొట్టింది. పదిహేడో సీజన్ ముందు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మెంటార్‌గా ఉన్న గౌతీ.. రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పేసి కోల్‌కతా ఫ్రాంచైజీ గూటికి తిరిగొచ్చాడు.
మినీ వేలంలో ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)ను రికార్డు ధర(రూ.24.75 కోట్లు)కు కొనడంతో మొదలు జట్టు కూర్పులో గంభీర్ తన మార్క్ చూపించాడు. ఓపెనింగ్ కాంబినేషన్‌ను సెట్ చేశాడు. సునీల్ నరైన్ (Sunil Narine)ను మళ్లీ ఓపెనర్‌గా పంపడమే కాదు.. ఆండ్రూ రస్సెల్ ఆల్‌రౌండర్‌గా రాణించడంలో కీలక పాత్ర పోషించాడు. పదహారో సీజన్లో కోహ్లీతో గొడవతో వార్తల్లో నిలిచిన గంభీర్.. ఈసారి మౌనంగా ఉంటూనే తాను అనుకున్నది సాధించాడు. పదేండ్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా కలను నిజం చేశాడు.
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌తో హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవికాలం ముగియనుంది. దాంతో, ఆలోపే కొత్త కోచ్‌ను నియమించాలని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సీనియర్ ఆటగాళ్లు గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming)లను కోచ్ పదవి స్వీకరించాల్సిందిగా కోరింది. అయితే.. గౌతీ మాత్రం ఐపీఎల్ ఫైనల్ హడావిడిలో పడి ఏమీ స్పందించలేదు. కనీసం చివరి తేదీ మే 27న కూడా అతడు కోచ్ పదవికి అప్లై కూడా ఏయలేదు. అయినా సరే.. ముక్కుసూటిగా, మొండిగా ఉండే గంభీర్ భారత జట్టుకు కోచ్‌గా ఉండాలని జై షా సహా బీసీసీఐ పెద్దలు పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా ద్రవిడ్ తర్వాత కొత్త కోచ్ ఎవరనేది వరల్డ్ కప్ ముగిసేలోపు తెలిసిపోనుంది.