Eoin Morgan : టీ20 వరల్డ్ కప్ పోటీల ఆరంభానికి మరో నాలుగు రోజులే ఉంది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England)తో సహా పలు జట్లు ఫేవరెట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) విజేతగా నిలిచేది ఎవరో ఊహించాడు. ఈసారి టీమిండియా ట్రోఫీని ఎగరేసుకుపోతుందని మోర్గాన్ అన్నాడు.
స్కై స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన మోర్గాన్.. ‘నా దృష్టిలో టీమిండియా ఈసారి చాలా బలంగా ఉంది. టోర్నీ ఆసాంతం గాయాలు వెంబడించినా కూడా ఆ జట్టే ఫేవరెట్. వరల్డ్ కప్‌లో భారత్ అన్ని జట్లను తేలికగా ఓడిస్తుంది. మరో విషయం ఏంటంటే..? ఎంతో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు కూడా 15 మంది బృందంలో చోటు దక్కించుకోలేకపోయారు’ అని వెల్లడించాడు.
టీమిండియా తుది స్క్వాడ్‌లో శుభ్‌మన్ గిల్(Shubman Gill)ను ట్రావెల్ రిజర్వ్‌గా తీసుకోవడం సరికాదని మోర్గాన్ అన్నాడు. ‘భారత సెలెక్టర్లు యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) బదులు గిల్‌ను తీసుకోవాల్సింది ఒకవేళ నేనే సెలెక్టర్ అయితే గిల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసేవాడిని’ అని మోర్గాన్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేయడంతో పాటు టీ20 ట్రోఫీ అందించిన మోర్గాన్ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
ఐసీసీ తొలిసారి నిర్వహించిన పొట్టి ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్.. మరోసారి ట్రోఫీ వేటకు సిద్ధమైంది. 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా తొలి చాంపియన్‌గా అవతరించింది. 2016లో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమిండియా 2022లో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. నిరుడు టెస్టు గదతో పాటు వన్డే వరల్డ్ కప్ టైటిల్ పోరులో ఆస్ట్రేలియా దెబ్బకు భారత జట్టు ఐసీసీ ట్రోఫీని చేజార్చుకుంది.
దాంతో, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో భారత బృందం న్యూయార్క్‌కు వెళ్లింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, యజ్వేంద్ర చాహల్‌లకు ఇదే ఆఖరి టీ20 ప్రపంచ కప్. అందుకని టైటిల్‌తోనే స్వదేశానికి రావాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.