Gautam Gambhir | భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ నియమించింది. కోచ్ పాత్రకు గంభీర్ న్యాయం చేస్తాడని బోర్డు భావిస్తున్నారు. కొత్త కోచ్ రాకతో భారత జట్టు కోచింగ్ సెటప్‌లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సైతం నిష్క్రమించారు. ఆయా స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా.. తనకు అవసరమైన సపోర్టింగ్ స్టాఫ్‌ను తానే ఉంచుకుంటానని గంభీర్ షరతు విధించినట్లు తెలుస్తున్నది.
అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్‌గా మాజీ భారత ఫాస్ట్ బౌలర్ ఆర్ వినయ్ కుమార్‌ను తీసుకునేందుకు గంభీర్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఓ స్పోర్ట్స్ మీడియా నివేదిక ప్రకారం.. గంభీర్‌కు సహాయ కోచ్‌గా అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్‌గా ఆర్ వినయ్ కుమార్‌ను తీసుకోవాలని బీసీసీఐకి సూచించినట్లు పేర్కొంది. గంభీర్ కోచ్ పదవీకాలం శ్రీలంక సిరీస్‌తో మొదలవనున్నారు. ఈ క్రమంలో త్వరలోనే గంభీర్ సిఫారసుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడంతో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ స్థానంలో గంభీర్ బలమైన పోటీదారుగా నిలిచాడు. కోచ్‌గా ఎంపికైన అనంతరం గంభీర్ స్పందిస్తూ.. దేశానికి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. బీసీసీఐ, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్, సపోర్టింగ్ స్టాఫ్, ముఖ్యంగా ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని తెలిపాడు.
లంక పర్యటనలో భాగంగా టీమిండియా ఈ నెల 27 నుంచి ఆగస్టు 7 వరకు మూడు టీ20 మ్యాచులు ఆడనున్నది. ఆ తర్వాత మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో తలపడనున్నది. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రకటన విడుదల చేశారు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బోర్డు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టీమ్ ఇండియా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ మంగళవారం గంభీర్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసిందని బోర్డు పేర్కొంది.