Gautam Gambhir : భారత పురుషుల జట్టు కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) లండన్‌లో కొత్త ఏడాదికి స్వాగతం పలికాడు. బ్రేక్ దొరకడంతో వెకేషన్‌కు లండన్ వెళ్లిన గౌతీ.. అక్కడే కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నాడు. భార్య నిటాశా జైన్, ఇద్దరు కూతుళ్ల(అజీన్ గంభీర్, అనైజా గంభీర్)తో కలిసి ఫొటోలను గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా వైట్‌వాష్‌కు గురవ్వడంతో విమర్శలు ఎదుర్కొన్న గంభీర్.. వన్డే, టీ20 సిరీస్ విజయాలతో కాస్త ఊరట చెందాడు. పొట్టి ప్రపంచకప్ సన్నాహాల్లో ఉన్న టీమిండియా.. జనవరిలో న్యూజిలాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ ఆడనుంది. వన్డే, టీ20 సిరీస్ కోసం కివీస్ త్వరలోనే భారత్‌కు రానుంది. దాంతో.. కాస్త గ్యాప్ దొరికినందున గంభీర్ కుటుంబంతో కలిసి లండన్‌లో వాలిపోయాడు.
ఫిబ్రవరి 7న స్వదేశంలో పురుషుల టీ20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. సో.. ఈ మెగా టోర్నీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశముంది. ఇక కోచ్‌గానూ గౌతీ పెద్దగా మెప్పించలేదు. ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్‌కు గౌతీ కోచ్‌గా పనికిరాడని, అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ, లక్ష్మణ్ సుముఖంగా లేకపోవడంతో గంభీర్‌నే కొనసాగించే అవకాశముంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ వరకూ ఈ మాజీ ఆటగాడు టీమిండియా కోచ్‌గా కొనసాగనున్నాడు.