కరాచీ: ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్లో మరో పిడుగు! ఈ ఏడాది ఏప్రిల్లో పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు హెడ్కోచ్గా నియమితుడైన దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టెన్.. ఆరు నెలలు తిరగకముందే ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
గ్యారీ తప్పుకోవడానికి గల కారణాలను పీసీబీ తెలపకపోయినా జట్టు సభ్యులతో పాటు బోర్డుతోనూ విభేదాల వల్లే అతడు రాజీనామా చేసినట్టు పీసీబీ వర్గాల సమాచారం. కిర్స్టెన్ స్థానంలో టెస్టు జట్టుకు హెడ్కోచ్గా ఉన్న జాసన్ గిలెస్పీకి పీసీబీ అదనపు బాధ్యతలను అప్పగించింది. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ వరకు అతడు ‘మెన్ ఇన్ గ్రీన్’కు హెడ్కోచ్గా వ్యవహరిస్తాడు.