ఓవల్: 90 ఓవర్లలో 291. ఇదీ ఇవాళ్టి ఇంగ్లండ్ టార్గెట్. ఓవల్ మైదానంలో నాలుగవ టెస్ట్ థ్రిల్లింగ్ ఫినిష్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇంగ్లండ్, ఇండియా టెస్ట్ సిరీస్ సాగుతున్న తీరు మళ్లీ టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తిని రేపుతున్నది. వాస్తవానికి పాత కాలం తరహాలో.. నెమ్మదిగా స్కోరింగ్ లేకున్నా.. ప్రస్తుతం టెస్టుల్లో జోరు పెరిగింది. చాలా వరకు టెస్టు మ్యాచ్‌లో అయిదు రోజుల్లోపే ముగుస్తున్నాయి. అయితే ఇవాళ ఓవల్‌లో చివరి రోజు ఎలా ముగుస్తుందో అని క్రికెట్ అభిమానులు ఉత్కంఠంతో ఎదురుచూస్తున్నారు. రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 77 రన్స్‌తో ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు.. చివరి రోజున భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.
టెస్ట్ సిరీస్ సాగుతున్న తీరు పట్ల బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యారు. క్రికెట్ అత్యుత్తమ దశలో కొనసాగుతున్నట్లు గంగూలీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. హోరాహోరీగా సాగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఎవరూ కొట్టిపారేయలేరన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ అయినా, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్ అయినా, అత్యుత్తమ ఆటకు నిదర్శనంగా నిలుస్తున్నాయని గంగూలీ అన్నారు. ఈ రెండు సిరీస్‌ల్లోనూ టెస్ట్ క్రికెట్ నైపుణ్యం బయటపడినట్లు గంగూలీ అభిప్రాయపడ్డారు.
ఓవల్‌లో థ్రిల్లర్ తప్పదన్న ఆలోచనల్లో క్రికెట్ ప్రేమికులు మునిగిపోయారు. విభిన్నంగా మారుతున్న ఓవల్ పిచ్‌పై ఏ మ్యాజిక్ జరిగినా ఆశ్చర్యం లేదు. ఇండియా గెలవొచ్చు. ఇంగ్లండ్ గెలిస్తే అద్భుతమే. మ్యాచ్ టై అయ్యే అవకాశాలూ ఉన్నాయి. డ్రాకు కూడా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది క్రికెట్ పండితులు మాత్రం ఇండియా గెలిచే ఛాన్సు ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం అయ్యే ఆఖరి రోజు ఆటపై అందరి కళ్లు నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఇండియా ఫెవరేట్‌గా ఉన్నా.. డ్రాకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఇంగ్లండ్ సీనియర్లు భావిస్తున్నారు. చివరి రోజున కెప్టెన్ కోహ్లీకి మాత్రం ఫుల్ టెన్షన్ తప్పుదు. ఇంగ్లండ్‌ను అడ్డుకోవాలంటే.. కోహ్లీ కెప్టెన్సీ నైపుణ్యం బయటపడాల్సిందే. కేవలం పేస్ బౌలర్లతో ఇండియన్ కెప్టెన్ ఎలా ఇంగ్లండ్‌ను నిలువరిస్తాడో ఆసక్తికరంగా మారనున్నది. ఇరు జట్లకు అవకాశం ఉన్న ఈ మ్యాచ్ ఓ క్లాసిక్‌గా మారే అవకాశాలూ ఉన్నాయి.
నాలుగవ టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టులో క్రిస్ వోక్స్ కీలక ప్లేయర్‌గా నిలిచాడు. అతను రెండు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకునే అవకాశాలు తమకే ఉన్నట్లు వోక్స్ అన్నాడు. టార్గెట్‌ను అందుకునేందుకు కావాల్సినంత సమయం ఉందని, రెండవ ఇన్నింగ్స్ లో తొలి సెషన్ తమకు ఊరటనిచ్చిందని, ఆఖరి రోజు వత్తిడి లేకుండా ఆడుతామని వోక్స్ తెలిపాడు. భారత బౌలర్లు ప్రత్యర్థుల్ని ఆలౌట్ చేస్తారా.. లేక ఇంగ్లండ్ స్టన్నింగ్ విక్టరీ కొడుతుందా అన్నదే ఇవాళ్టి మ్యాటర్.
Cricket at its best..Nothing can beat a well fought test series..The one in Australia and now this one ..The most skilfull form of cricket ..@BCCI
— Sourav Ganguly (@SGanguly99) September 5, 2021
@ICC