Team India | భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన బెస్ట్ భారత జట్టును ప్రకటించారు. టీమిండియా దిగ్గజ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలకు సైతం చోటు కల్పించలేదు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను సైతం పక్కనబెట్టి రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటిచ్చాడు. ఆకాశ్ చోప్రా బెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. కోహ్లీ సైతం టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అతని కెప్టెన్సీలో టీమిండియా 68 టెస్టుల్లో 40 గెలిచి, 17 మ్యాచుల్లో ఓడిపోయింది. మరో 11 టెస్టులు డ్రాగా ముగిశాయి. సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లకు ఓపెనింగ్ జోడీగా, మూడోస్థానానికి రాహుల్ ద్రవిడ్, నాలుగో నెంబర్లో సచిన్ టెండూల్కర్‌ను ఎంపిక చేశాడు.
ఐదోస్థానంలో కెప్టెన్ విరాట్‌ను, వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, ఆల్రౌండర్లుగా కపిల్ దేవ్, అశ్విన్‌ను తీసుకోగా.. దిగ్గజ మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేతో పాటు ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌ను ఎంచుకున్నాడు. ఆకాశ్ చోప్రా జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఇద్దరు ఆల్ రౌండర్లు, ఓ స్పిన్నర్, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఈ జట్టులో ఉన్న సెహ్వాగ్, సచిన్ సైతం బౌలింగ్ చేయగలరు. ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్న బుమ్రా, రిషబ్ పంత్‌కు మాత్రమే ఆకాశ్ చోప్రా చోటిచ్చాడు. ఇదిలా ఉండగా.. విరాట్, రోహిత్ శర్మ ఇద్దరు టెస్టులకు రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు తొలిసారిగా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నది. ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో వెనుకబడింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఈ నెల 23 నుంచి ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు ఆడనున్నది.