ఐసీసీ చైర్మన్ పదవికి ఇద్దరు పోటీ!
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్ పదవి కోసం ఆసక్తికర పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుత చైర్మన్ న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే పదవీకాలం ఈ ఏడాది ఆఖర్లో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక పదవిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా కన్నేసినట్లు తెలిసింది. గడువు ముగిసిన తర్వాత పదవిలో తిరిగి కొనసాగేందుకు బార్క్లే ఆసక్తి కనబరిచే ఉద్దేశం లేకపోవడంతో కొత్త చైర్మన్ ఎంపిక అనివార్యం కాబోతున్నది. దీంతో ప్రతిష్ఠాత్మక పదవి కోసం దాదా, జై షా ఇద్దరు పోటీపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా ఈ ఏడాది అక్టోబర్‌తో తన పదవీకాలాన్ని ముగించుబోతున్న దాదా..ఐసీసీలో అడుగుపెట్టేందుకు మొగ్గుచూపిస్తున్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న జై షా కూడా ఐసీసీ చైర్మన్ గిరి కోసం పోటీపడేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భారత్ వేదికగా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఆ సమయానికి ఐసీసీ చైర్మన్ హోదాను దక్కించుకునేందుకు ఈ ఇద్దరు ఆసక్తి కనబరుస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన సమయంలో శరద్ పవార్ ఐసీసీ చైర్మన్ హోదాలో ఉన్నారు. సరిగ్గా అదే రీతిలో చైర్మన్ పీఠాన్ని అధిరోహించేందుకు గంగూలీ, షా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కొడుకు అయిన జై షా పంతం నెగ్గుతుందా లేక భారత మాజీ కెప్టెన్ గంగూలీ పట్టుదలను విజయం వరిస్తుందా అన్నది వేచిచూడాలి.