Gautam Gambhir : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో గౌతం గంభీర్ (Gautam Gambhir) మెంటార్‌గా కొత్త సవాల్ ఎదుర్కోనున్నాడు. కెప్టెన్‌గా రెండు కప్‌లు అందించిన కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు గౌతీ ఈసారి మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. 17వ సీజన్‌కు మరో మూడు రోజులు ఉందనగా ఈ లెజెండరీ ఆటగాడు కోల్‌కతాకు ఆడిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
‘కోల్‌కతాను నేను విజయవంతైన జట్టును చేయలేదు. కోల్‌కతానే నన్ను విజేతను చేసింది. నన్ను ఒక నాయకుడిని చేసింది’ అని గౌతీ వెల్లడించాడు. అంతేకాదు ఫ్రాంచైజీ సహ యజమాని షారుక్ ఖాన్ తనతో చెప్పిన మాటల్ని కూడా అతడు పంచుకున్నాడు. ‘నన్ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం.
అయితే.. నాపై నమ్మకంగా బాధ్యతలు అప్పగించిన షారుఖ్ ఖాన్, మైసోర్ (కోల్‌కతా మేనేజింగ్ డైరెక్టర్)లకు చాలా ధన్యవాదాలు. 2012లో కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు.. ఇప్పుడు మెంటార్‌గా రాగానే బాద్ షా నాతో ఒకటే చెప్పాడు. ఇది నీ ఫ్రాంచైజీ. దీన్ని నిలబెడుతావా? ముక్కలు చేస్తావా? అనేది నీ చేతుల్లోనే ఉంది’ అని అన్నాడు అని గంభీర్ తెలిపాడు.
కోల్‌కతా మాజీ కెప్టెన్ అయిన గౌతీ.. ఆ జట్టును రెండు సార్లు చాంపియన్‌గా నిలిపాడు. ఈ విధ్వంసక ఓపెనర్ సారథ్యంలో కోల్‌కతా 2012, 2014లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అతడు ఐపీఎల్ 17వ సీజన్ వేలానికి ముందు సొంత గూటికి చేరాడు. 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) మెంటార్‌గా ఉన్న గంభీర్ కోల్‌కతా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. గంభీర్ తర్వాత ప్యాట్ కమిన్స్, ఇయాన్ మోర్గాన్, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రానా.. ఇలా కెప్టెన్లు మారారు. కానీ, కోల్‌కతా రాత మారలేదు. దాంతో, కోల్‌కతా యాజమాన్యం మళ్లీ గంభీర్‌ను సంప్రతించింది. పదహారు సీజన్లుగా ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ఐపీఎల్ మార్చి 22న షురూ కానుంది. కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను ఢీకొననుంది.