హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 18 : పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే భారత జట్టుకు తెలంగాణకు చెందిన గాడిపల్లి ప్రశాంత్ ఎంపికయ్యాడు. అమెరికాలోని ఇండియానాలో అక్టోబర్ 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే టోర్నీ కోసం 14 మందితో సోమవారం ఎంపిక చేసిన జట్టులో ప్రశాంత్ చోటు దక్కించుకున్నాడు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ వాసి అయిన ప్రశాంత్ రెండోసారి ఎంపికయ్యాడు. పుట్టుకతోనే దివ్యాంగుడైన ప్రశాంత్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. సొంత ఖర్చులతో అమెరికా వెళ్లడానికి అప్పు చేయాల్సి వస్తుందని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. సాయం చేయాలనుకునే వారు ఈ నంబర్(90006 83937)లో సంప్రదించవచ్చని అన్నాడు.