హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడాటోర్నీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఏషియన్ క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నీతో పాటు జాతీయ త్రోబాల్ పోస్టర్లను మంత్రి తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న హ్యాండ్‌బాల్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా జూన్ 21 నుంచి ఏషియన్ టోర్నీని నిర్వహిస్తున్నట్లు జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం(ఏఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. మరోవైపు సఫీల్‌గూడ డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఈనెల 28 నుంచి 30 వరకు త్రోబాల్ టోర్నీ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 23 రాష్ర్టాల నుంచి దాదాపు 500 మంది ప్లేయర్లు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్రావు, రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్‌యాదవ్, కార్యదర్శి జగన్మోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.