నిరుపేద రైతు కడుపున పుట్టాడు..! గున్నపెంకల ఇంట్లో పెరిగాడు..! కటిక పేద అయినా బాల్యం నుంచే హాకీపై మక్కువ పెంచుకున్నాడు..! కొనేందుకు డబ్బులు లేక వెదురు కర్రలను హాకీ స్టిక్లుగా చేసుకుని, బట్టచింపులను బంతులుగా చుట్టుకుని.. సోదరుడు, స్నేహితులతో కలిసి హాకీ ఆడటం మొదలుపెట్టాడు..! ఒకవైపు పొలం పనుల్లో తల్లిదండ్రులకు సాయపడుతూనే మరొకవైపు రోజూ గంటలకొద్ది సాధన చేశాడు..! దాంతో మెరికలాంటి ఆటగాడిగా తయారయ్యాడు..! జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నీల్లో అద్భుత ఆటతీరు కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు..! గత మూడునాలుగేండ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లోనూ రాణిస్తున్నాడు..! ఇప్పుడు ఏకంగా ప్రపంచకప్‌లోనే కాలుపెట్టాడు..! అతడే భారత హాకీ జట్టులో కీలక ప్లేయర్ నీలమ్ సంజీప్ జెస్..!
పట్టుదలతో కృషి చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని, అనుకున్నది సాధించడానికి పేదరికం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించిన నీలమ్ సంజీప్ జెస్.. ప్రపంచస్థాయి ఆటగాడిగా ఎదగకముందేకాదు, ఇప్పుడు కూడా పేదరికాన్నే అనుభవిస్తున్నాడు. ఎప్పుడో 40 ఏండ్ల క్రితం తండ్రి కట్టుకున్న గున్నపెంకల ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. పైగా ఆ ఇంటికి గ్యాస్ కనెక్షన్ లేదు. నల్లా నీటి కనెక్షన్ లేదు. నాలుగేండ్ల క్రితం వరకైతే కరెంటు కనెక్షన్ కూడా ఉండేది కాదు. జెస్ తల్లిదండ్రులు ఇప్పటికీ కూలీనాలీ చేసుకునే జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఏ సాయం అందలేదని, ఇప్పటికైనా తమకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తే బాగుండునని సంజీప్ జెస్ తండ్రి బిపిన్ జెస్ ఆశాభావం వ్యక్తంచేశారు.
చిన్నప్పటి నుంచే హాకీ అంటే ప్రాణం
ఒడిశా రాష్ట్రంలోని సుందర్‌గఢ్ జిల్లా, క్వార్ముండా బ్లాక్, కొడబహల్ గ్రామం నీలమ్ సంజీప్ జెస్ స్వస్థలం. అక్కడి చుట్టుపక్కల గ్రామాల్లో యువత కాలక్షేపానికి ఎక్కువగా హాకీ అడుతుంటారు. వారిని చూస్తూ జెస్ చిన్నప్పటి నుంచే హాకీ ఆటపై మక్కువ పెంచుకున్నాడు. అయితే, హాకీ ఆడాలంటే హాకీస్టిక్ కావాలి. బాల్స్ కావాలి. మరి అవి కొనేందుకు అతని దగ్గర డబ్బులు ఉండేవి కావు. అందుకే వెదురు కర్రలను కోసుకొచ్చి హాకీ స్టిక్లుగా చేసుకుని, చిరిగిన బట్ట ముక్కలను బంతుల్లా గుండ్రగా చుట్టుకుని తన సోదరుడితో, స్నేహితులతో హాకీ ఆడేవాడు.
17వ ఏట భారత హాకీ జట్టులో చోటు
తనతో ఆడుతున్న వారిలో వెళ్లిపోయేవాళ్లు వెళ్లిపోతూ, కొత్తగా వచ్చిచేరువాళ్లు వస్తూ ఉన్నా.. జెస్ మాత్రం అవిశ్రాంతంగా గంటల క్రమేణ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు. అందుకే ఆటలో బాగా రాటుదేలిపోయాడు. దాంతో చిన్నచిన్న టోర్నీల్లో చోటుదక్కించుకున్నాడు. అలా ఆడుతూనే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ఆటగాడిగా అంచెలంచెలుగా ఎదిగాడు. ఆ తర్వాత అంతర్జాతీయస్థాయికి రావడానికి అతను ఎక్కువ సమయమేం పట్టలేదు. 2016లో తన 17వ ఏట భారత హాకీ జట్టులో చోటు సంపాదించాడు.
కెరీర్లో తొలి ప్రపంచకప్
2016 సౌత్ఏషియన్ గేమ్స్‌లో అతడు సభ్యుడిగా ఉన్న భారత జట్టు రజత పతకం నెగ్గింది. 2017లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ అండర్-18 టోర్నీలో పసిడి పతకం సాధించిన భారత హాకీ జట్టుకు సంజీప్ జెస్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పుడు ఒడిశా వేదికగా జరుగుతున్న 15వ హాకీ ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత హాకీ జట్టులో చోటుదక్కించుకుని తన కెరీర్లో తొలి ప్రపంచకప్ ఆడుతున్నాడు. కటిక పేదరికం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచస్థాయి ఆటగాడైన సంజీప్ కచ్చితంగా ఎందరో యువకులకు ఆదర్శప్రాయుడే కదా..!
స్పెయిన్‌తో తొలి మ్యాచ్
ఒడిశా వేదికగా జరుగుతున్న 15వ హాకీ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, వేల్స్, స్పెయిన్ జట్లతో కలిసి భారత్ పూల్ D లో ఉంది. ఇవాళ రూర్కెలాలోని బిర్సాముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో స్పెయిన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. శుక్రవారం రాత్రి 7 గంటల ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీలో ఇది మూడో మ్యాచ్. శుక్రవారం మధ్యాహ్నం ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్, సౌతాఫ్రికా, అర్జెంటినా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగాయి. ఆస్ట్రేలియా, అర్జెంటీనా జట్లు విజయం సాధించాయి.