విశ్వక్రీడల చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రఖ్యాత సీన్ నది తీరం వెంబడి, ఆరుబయట ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టి ప్రపంచాన్ని ఆబ్బురపరిచిన ‘పారిస్’.. ముగింపు వేడుకలనూ అదే స్థాయిలో నిర్వహించింది. గత నెల 25న అట్టహాసంగా మొదలైన ఒలింపిక్స్‌కు ఆదివారం (ఆగస్టు 11)తో తెరపడింది. స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం వేదికగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజిషియన్లు, కండ్లు మిరుమిట్లుగొలిపే లైటింగ్ షో, హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ విన్యాసాలు, కళాకారుల కళారూపాలు వెరసి 17 రోజుల పాటు సాగిన ఒలింపిక్స్‌కు ఫ్యాషన్ నగరి ఘనంగా వీడ్కోలు పలికింది. 2028 ఎడిషన్‌కు హాలీవుడ్ అడ్డా లాస్ ఏంజెల్స్ ముస్తాబవుతోంది.
Paris Olympics | పారిస్: నాలుగేండ్లకోసారి వచ్చే ప్రపంచ అతిపెద్ద క్రీడా పండుగ ముగిసింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా 17 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన ఒలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఒలింపిక్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీన్ నదిలో ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించి ‘ఔరా’ అనిపించిన పారిస్.. ముగింపు వేడుకలనూ అదే స్థాయిలో మురిపించింది. ప్రఖ్యాత స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం వేదికగా భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటలకు మొదలైన ఈ వేడుకలు అభిమానులను ఉర్రూతలూగించాయి. సుమారు 80వేల మంది హాజరైన ఈ ముగింపు కార్యక్రమంలో 270 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో అభిమానులను అలరించారు.
ఫ్రాన్స్ స్విమ్మింగ్ సంచలనం తాజా ఒలింపిక్స్‌లో ఏకంగా నాలుగు స్వర్ణాలు గెలిచిన లియోన్ మర్చండ్ వేదికపైకి ఒలింపిక్ జ్యోతిని తీసుకురావడంతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్ అభిమానులకు అభివాదం చేసి అథ్లెట్ల పరేడ్‌ను ప్రారంభించారు. భారత పతాకధారులుగా మను భాకర్, పీఆర్ శ్రీజేష్ వ్యవహరించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన లైటింగ్ షో అభిమానులను కట్టిపడేసింది. ఫ్రెంచ్ బాండ్ ఫోనెక్స్, యూఎస్ గాయని హెచ్. ఈ.ఆర్ తమ పాటలతో జోష్‌ను పెంచారు.
ముగింపు వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ‘మిషన్ ఇంపాజిబుల్’లో అతడు చేసినట్టుగా స్టేడియం పైనుంచి వైర్ సాయంతో గాల్లో చేసిన విన్యాసాలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అనంతరం పారిస్ మేయర్ అన్నె హిడల్గొ ఒలింపిక్ జెండాను థామస్ బాచ్కు ఇవ్వగా ఆయన లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బస్‌కు పాస్ అందజేయడంతో ఆ నగరంలో ఒలింపిక్ సందడి మొదలైంది.