బ్యాంకాక్ : ఆసియా అండర్-19, 22 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించేందుకు అడుగుదూరంలో నిలిచారు. బుధవారం జరిగిన అండర్-22కి సంబంధించిన పలు కేటగిరీలలో నలుగురు యువ బాక్సర్లు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరారు. పురుషుల 90 కిలోల విభాగంలో ఇషాన్ కటారియా నీరజ్ (75 కి.) ఫైనల్స్ చేరగా మహిళల విభాగంలో యత్రి పటేల్ (57 కి.), ప్రియ (60 కి.) స్వర్ణం లేదా రజతాన్ని ఖాయం చేసుకున్నారు.
మొదట నీరజ్.. 5-0తో దక్షిణ కొరియా బాక్సర్ కియొంగొ బంగ్ను ఓడించి ఫైనల్ చేరగా ఇషాన్.. చైనాకు చెందిన చెన్ చెన్పై గెలిచాడు. యత్రి.. 5-0తో తి నుంగ్ (వియత్నాం)ను చిత్తుచేసింది. మరో పోరులో ప్రియ.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ ఇస్మొయిలొవపై ఏకపక్ష విజయం సాధించింది. హర్ష్ (60 కి.), మయూర్ (90 కి.) సెమీస్‌లో ఓడినా కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు.