ముంబై: హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమిస్తున్నది. భాగ్యనగరం వేదికగా ఫార్ములా-ఈ రేసుకు త్వరలో తెరలేవబోతున్నది. దేశంలో తొలిసారి జరుగబోతున్న రేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. ఫిబ్రవరి 11న రేసు జరుగనున్న నేపథ్యంలో ముంబైలో గురువారం కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చారిత్రక గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా తొమ్మిదో సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. వాతావరణ కాలుష్యానికి ఎలాంటి ఆస్కారం లేకుండా పూర్తిగా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన కార్లు హైదరాబాద్ రోడ్లపై రయ్య్‌మ్రంటూ పరుగులు తీయనున్నాయి. తొమ్మిదో సీజన్లో భాగంగా నాలుగో రేసుకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది.
ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘భారత్‌లో తొలిసారి ఫార్ములా-ఈ రేసింగ్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండటం..యావత్ దేశానికి గర్వకారణంగా భావిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన జీవనాన్ని అందించగల్గుతాం. అంతర్జాతీయ ఈవెంట్ హైదరాబాద్‌లో జరుగడం మరిచిపోలేని అనుభూతి. ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ వాసులందరినీ సాదరంగా తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గ్రీన్కో ఫౌండర్ అనిల్‌కుమార్ చలంశెట్టి అతిథులుగా పాల్గొన్నారు.
హాట్‌కేకుల్లా టిక్కెట్లు:
హైదరాబాద్‌లో వచ్చే నెలలో జరిగే ఫార్ములా-ఈ రేసు కోసం టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. టిక్కెట్ల రేట్లను నిర్వాహకులు నాలుగు కేటగిరీలు విభజించారు. రేసును ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు అమితంగా ఆసక్తి చూపిస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
11 జట్లు, 22 కార్లు:
ఫార్ములా-ఈ రేసులో మొత్తం 11 జట్ల నుంచి 22 కార్లు బరిలోకి దిగుతున్నాయి. ఇందులో ప్రఖ్యాత రేసింగ్ కంపెనీలుగా పేరొందిన మెక్లారెన్, మసారెటీ, పొర్శె, జాగ్వర్, నిస్సాన్, మహీంద్రా రేసింగ్ కార్లు పోటీపడుతున్నాయి. జెన్3 ఎరా కారు రేసింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. గంటకు 322కి.మీల వేగంతో రివ్వున దూసుకుపోయే ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, తేలికైన. మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఎఫిషియెంట్ కారుగా పేరొందింది.
ఫార్ములా-ఈ గురించి
జీరో కర్బన ఉద్గారాలు విడుదల అనేది ఫార్ములా-ఈ రేసింగ్ ప్రత్యేకత. వాతావరణంలో ఎలాంటి కాలుష్యం లేకుండా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో ఈ కార్లు నడుస్తాయి. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో రేసింగ్‌లు నిర్వహించడం ద్వారా ఫార్ములా-ఈ రేసింగ్‌కు మరింత ఆదరణ తీసుకొస్తున్నారు. దీనికి తోడు భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహానాల తయారీ రంగానికి మంచి తోడ్పాటు అందించనుంది.