Amit Mishra : భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ల గురించి వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) సంచలన విషయాలు వెల్లడించాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు మిశ్రా ఆసక్తికర సమాధానం చెప్పాడు తాజాగా శుభాంకర్ మిశ్రా అనే యూట్యూబర్ షోలో మాట్లాడాడు. ఈ సందర్భంగా శుభాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపెన్‌గా బదులిచ్చాడు.
కోహ్లీ, హిట్మ్యాన్లలో ఎవరు బెస్ట్ కెప్టెన్ ? ఎవరికి జట్టులో స్నేహితులు ఎక్కువ? అనే ప్రశ్నలకు మిశ్రా ఏం చెప్పాడంటే.. ‘కోహ్లీకి యాటిట్యూడ్ ఎక్కువ. పాపులారిటీ, కెప్టెన్సీ కారణంగా విరాట్ చాలా మారిపోయాడు. అందుకనే అతడికి జట్టులో స్నేహితులు తక్కువ. అదే హిట్‌మ్యాన్ విషయానికొస్తే అతడు చాలా ప్రత్యేకం. కెప్టెన్సీ వచ్చాక విరాట్ మాదిరిగా అతడు మారలేదు. నేను మొదటిరోజు చూసినప్పుడు రోహిత్ ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు’ అని మిశ్రా వివరించాడు.

‘నేను టీమిండియాకు తక్కువ రోజులే ఆడాను. కానీ, ఏపీఎల్‌లో కలిసినప్పుడు రోహిత్ నవ్వుతూ పలకరించేవాడు. భారత జట్టు కెప్టెన్ అయినా నాతో స్నేహంగా మెలిగేవాడు. రోహిత్ వరల్డ్ కప్ విజేత. అంతేకాదు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు’ అని మిశ్రా తెలిపాడు.

లెగ్ స్పిన్నర్ అయిన మిశ్రా 2008లో టీమిండియాలో జెర్సీ వేసుకున్నాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. కోహ్లీ కెప్టెన్సీలో అతడు ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. మొత్తంగా 22 టెస్టుల్లో మిశ్రా 33 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్లో దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు ఆడాడు. 17వ సీజన్లో మిశ్రా లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు ప్రాతినిధ్యం వహించాడు.