హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ లోపాలమయంగా ఉందని సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ప్రతిష్టాత్మక టోర్నీలైన ఒలింపిక్స్, ఆసియాగేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు ప్లేయర్లను సిద్ధం చేసేందుకు అవసరమైన హైఫెర్ఫార్మెన్స్ అకాడమీల స్థాపనపై స్పోర్ట్స్ పాలసీలో కనీసం ప్రస్తావన లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు, ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించే వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చే విధానంపై పాలసీలో లేకపోవడం విచారకరమన్నారు.
ప్రస్తుతం సాట్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కోచ్‌ల క్రమబద్దీకరణ, కొత్త కోచ్‌ల నియామకం గురించి ఎలాంటి ప్రకటనా లేకపోవడంపై కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కోచింగ్ వ్యవస్థను పటిష్టం చేయకుండా రాష్ర్టాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తయారుచేయలేరని తెలిపారు. క్రీడలకు వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని గొప్పలకు పోతున్న ప్రభు త్వం.. రాష్ట్రంలోని స్టేడియాలు, స్పోర్ట్స్ స్కూళ్ల ఆధునీకరణపై దృష్టి పెట్టాలని వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు.
మండల స్థాయిలో ప్రతిభావంతులైన ప్లేయర్లను గుర్తించి వారికి జిల్లా కేంద్రాల్లోని ఫీడర్ కేంద్రాల్లో ప్రాథమిక శిక్షణ అందించి ఆపై హైదరాబాద్‌లోని హై ఫెర్ఫార్మెన్స్ సెంటర్లలో అత్యుత్తమ ట్రైనింగ్ అందించాలని పేర్కొన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంశం ఐరావతంలా తయారైందని, కనీసం బ్లూప్రింట్ లేకుండా ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆయన విమర్శించారు.