న్యూఢిల్లీ : సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. తన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో దేశానికి చిరస్మరణీయ విజయాలు అందించిన భారత దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్‌అలీ(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న అలీ బుధవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నార్త్ అమెరికా క్రికెట్ లీగ్(ఎన్ఏసీఎల్) ఒక ప్రకటనలో పేర్కొంది. 1960-70 దశకంలో భారత్ తరఫున ఆడిన అలీ ఆల్‌రౌండర్‌గా అనితర సాధ్యమైన సేవలందించారు. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ క్రికెటర్లు ఎమ్ఏకే పటౌడీ, ఎమ్ఎల్ జైసింహా, అబ్బాస్ అలీ బేగ్ వంటి వారితో కలిసి ఆడిన అబిద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1967లో ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన అలీ తన తొలి మ్యాచ్‌లోనే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటారు.
తొలి ఇన్నింగ్స్‌లో 6/55 ప్రదర్శనతో కెరీర్ బెస్ట్ నమోదు చేసుకున్నారు. సిడ్నీలో జరిగిన మరో టెస్టులో 78, 81 పరుగులతో రాణించి ఔరా అనిపించారు. 1967-1974 మధ్య కాలంలో భారత్‌కు 29 టెస్టులాడిన అలీ 1,018 పరుగులతో పాటు 47 వికెట్లు పడగొట్టారు. వికెట్ల మధ్య చిరుతను తలపించే అలీ..మెరుపు ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా తరఫున అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో ఓపెనింగ్ చేసే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. దేశం తరఫున ఆడింది ఐదు వన్డేలైనా..వాటిపై చెరగని ముద్ర వేశారు. 1974లో అజిత్ వాడేకర్ సారథ్యం వహించిన భారత్‌కు అలీ తొలి వన్డే మ్యాచ్ ఆడారు. 1975 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఆడారు. ఇక దేశవాళీ విషయానికొస్తే..హైదరాబాద్ తరఫున 212 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన అబిద్ అలీ 8,732 పరుగులతో పాటు 397 వికెట్లు తీశారు. 173 నాటౌట్, 6/23 అత్యుత్తమ ప్రదర్శనగా నమోదు చేసుకున్నారు.
1941, సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో పుట్టిన అబిద్ అలీ బంతితో, బ్యాట్‌తో, అద్భుతమైన ఫీల్డర్గాను గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు దశాబ్దానికి పైగా హైదరాబాద్ తరఫున ఆయన ఆడారు. దిగ్గజ క్రికెటర్ ఎమ్ఎల్ జైసింహాను గురువుగా భావించే అలీతో కలిసి ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. జైసింహా సలహాతోనే తన బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకున్నానని పేర్కొనారు. 1959-60 సీజన్లో ఆంధ్రపై అరంగేట్రం చేసిన అలీ అనతికాలంలోనే ఆల్‌రౌండర్‌గా ఎదిగారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో తనదైన పాత్ర పోషిస్తూ జట్టుకు చిరస్మరణీయ విజయాలందించారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత హైదరాబాద్, ఆంధ్ర సహా అమెరికాలో యువ క్రికెటర్లను తీర్చిదిద్దారు. భారత, హైదరాబాద్ క్రికెట్లో ఆ రోజుల్లో అలీని అందరూ ముద్దుగా‘చిచ్చా’ అని పిలుచుకునేవారు.
సయ్యద్ అబిద్ అలీ సాబ్ మృతికి నా ప్రగాఢ నివాళి. నిజమైన హైదరాబాదీ క్రికెట్ దిగ్గజం. ఆల్‌రౌండర్‌గా ఆయన ఆట, తెగువ అమోఘం, భారత క్రికెట్‌పై అలీ చెరగని ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.