కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అయితే ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్దమాన్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న దంతన్పుర్ వద్ద ఘటన చోటుచేసుకున్నది. గంగూలీ ప్రయాణిస్తున్న కారును.. వేగంగా వెళ్తున్న లారీ ఓవర్టేక్ చేసింది. ఆ సమయంలో గంగూలీ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో అతడి కాన్వాయ్‌లోని వాహనాలు ఒక్కొక్కటి ఢీకొన్నట్లు బెంగాల్ పోలీసు వెల్లడించారు. వెనుక భాగం నుంచి కాన్వాయ్‌లోని కారు గంగూలీ వాహనాన్ని ఢీకొట్టనట్లు పోలీసులు తెలిపారు. కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. బుర్ద్వాన్ యూనివర్సిటీలో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. అయితే కాస్త ఆలస్యంగా ఆ కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు.