Shubman Gill : భారత టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్(Asia Cup 2025)లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. కెప్టెన్‌గా మొదటిదైన ఇంగ్లండ్ గడ్డపై సెంచరీల మోతతో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించిన గిల్.. ఆసియ దేశాల టోర్నీలో మాత్రం అలవోకగా వికెట్ ఇచ్చేస్తున్నాడు. అభిషేక్ శర్మకు జోడీగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న అతడు మూడు మ్యాచుల్లో కలిపి 35 రన్స్ చేశాడంతే. టెక్నిక్ పరంగా తిరుగులేని గిల్ పొట్టి ఫార్మాట్‌కు తగ్గట్టు దూకుడుగా ఆడబోయి వెనుదిరుగుతున్నాడు.
అభిషేక్ తరహాలో దంచికొట్టబోయిన గిల్.. బౌలర్ల వ్యూహాంలో చిక్కుకొని డగౌట్ చేరుతున్నాడు. దాంతో.. సూపర్-4 లో ఆదవారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనైనా ఈ డాషింగ్ బ్యాటర్ విలువైన ఇన్నింగ్స్ ఆడాలని కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువకెరటం గిల్‌కు మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా (Akash Chopra) అమూల్యమైన సలహా ఇచ్చాడు.
ఆకాశ్ చోప్రా
‘ఆసియాకప్‌లో అంచనాలను అందుకుంటూ అభిషేక్ ఇరగదీస్తున్నాడు. అతడు 200 స్ట్రయిక్ రేటుతో ఆడుతూ జట్టుకు శుభారంభం ఇస్తున్నాడు. మెరుపు వేగంతో షాట్లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలో పడేస్తున్నాడు. కానీ, గిల్ మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు. ఎందుకుంటే.. అతడు అభిషేక్‌లా దూకుడుగా ఆడాలని చూస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో యూఏపై 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన వైస్ కెప్టెన్ .. పాక్‌పై స్వల్ప స్కోర్‌కే ఆయూబో ఓవర్లో ఔటయ్యాడు. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై చెలరేగిపోతాడనుకుంటే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు గిల్. టీ20ల్లో సంజూ శాంసన్ బదులు ఓపెనర్ ఛాన్స్ కొట్టేసిన గిల్ అతడిలా ఆడే క్రమంలో విఫలమవుతున్నాడు.
Group Stage ✅#TeamIndia 🇮🇳 is 𝗥𝗮𝗿𝗶𝗻𝗴 𝗧𝗼 𝗚𝗼 in our 1⃣st game of Super Four! 👏 👏#AsiaCup2025 pic.twitter.com/lpbeU2Oi6C
— BCCI (@BCCI) September 21, 2025
ఇదంతా దూకుడుగా ఆడాలనే తాపత్రయంతో వచ్చిన ఇబ్బంది. అలా కాకుండా గిల్ ఐపీఎల్లో ఎలాగైతే తనదైన స్టయిల్లో ఎక్కువ ఓవర్లు ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించేవాడో.. ఇకపై సూపర్ 4 మ్యాచుల్లోనూ అదే చేయాలి. అతడు కనీసం ఏడు నుంచి 10 ఓవర్లు నిలబడితే చాలు పరుగులు వాటంతటవే వస్తాయి. ఒకవేళ గాయంతో బాధపడుతున్న అక్షర్ పటేల్ పాక్‌పై ఆడకుంటే.. బ్యాటింగ్ బలం తగ్గుతుంది. అందుకే.. దాయాదిపై గిల్ ఎక్కువ ఓవర్లు ఆడాల్సి వస్తుంది’ అని చోప్రా వెల్లడించాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలుతో ఇంగ్లండ్ పర్యటనకు సారథిగా ఎంపికైన గిల్.. తనలోని విధ్వంసక బ్యాటర్‌ను ప్రపంచానికి చూపించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 75.40 సగటుతో నాలుగు సెంచరీలు బాదిన అతడు ఏకంగా 754 పరుగులు సాధించాడు. కానీ.. దుబాయ్‌లో టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్‌లో మాత్రం తేలిపోతున్నాడీ రన్ మెషీన్. దాంతో.. మిడిలార్డర్‌పై ఎక్కువ భారం పడుతోంది. అలాకాకుండా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడినట్టు నిదానంగా మొదలెట్టి.. ఆఖర్లో సునామిలా చెలరేగాడంటే సూపర్ 4 దశలోనూ భారత జట్టుకు తిరుగులేనట్టే.