సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బాబ్ సింప్సన్ శకం ముగిసింది. తనదైన ఆటతీరు, నాయకత్వ శైలి, మెరుగైన కోచింగ్‌తో ఆసీస్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన 89 ఏండ్ల సింప్సన్ కన్నుమూశారు. వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో సింప్సన్ తుదిశ్వాస విడిచారు. దేశ క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసిన సింప్సన్ మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)శనివారం అధికారిక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసింది.
1957 నుంచి 1978 వరకు ఆస్ట్రేలియా క్రికెట్‌కు అన్నీతానై వ్యవహరించిన బాబ్ మృతికి సంతాపసూచకంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మూడో టీ20లో నల్లరిబ్బను ధరించారు. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ప్లేయర్లు కొద్దిసేపు మౌనం పాటించారు. ఆసీస్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లాడిన సింప్సన్ 4,869 పరుగులు చేశాడు.
ఇందులో 10 సెంచరీలు సహా 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లోనూ ఈ దిగ్గజ క్రికెటర్‌కు తిరుగులేదు. టెస్టుల్లో 71 వికెట్లు తీసిన సింప్సన్ స్లిప్ ఫీల్డర్‌గా 110 క్యాచ్‌లు అందుకున్నాడు. 1957లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన బాబ్..మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ(311) ఏడో ఆసీస్ బ్యాటర్‌గా సింప్సన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సిడ్నీలో జన్మించిన సింప్సన్ కుటుంబం స్కాట్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చి సెటిల్ అయ్యారు. 16 ఏండ్ల వయసులోనే న్యూసౌత్వెల్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సింప్సన్ మృతి పట్ల ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ సంతాపం ప్రకటించారు.