Yashasvi Jaiswal | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ప్రత్యేక రికార్డును నెలకొల్పాడు. భారత్ 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతుండగా.. 92 సంవత్సరాల చరిత్రలో ఇలా జరుగడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతులను చితక్కొట్టి ఈ రికార్డును సృష్టించాడు. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 35 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు.
సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్లతో కూడిన స్పెషల్ క్లబ్లో చేరాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెంటనే స్టార్క్ వేసిన తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ గేమ్ మార్చి ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్లో రెండు, మూడు, నాలుగు, ఆరో బంతిని బౌండరీకి పంపి.. 16 పరుగులు చేశాడు. దాంతో టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక పరుగులు రాబట్టిన తొలి బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డును సృష్టించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగులు ఇదే.
యశస్వి 10 ఇన్నింగ్స్‌లలో కలిపి 391 పరుగులు చేశాడు. 43.44 సగటుతో పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కోసం పర్యటించడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీ విజయ్ ముందున్నాడు. విజయ్ 2014-15లో 482 పరుగులు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 2003-04లో 464, సునీల్ గవాస్కర్ 1977-78లో అరంగేట్రం చేసిన టెస్టు సిరీస్‌లో 450 పరుగులు చేశారు.