Odisha | కటక్ : భారత్, ఇంగ్లండ్ మధ్య ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డే సందర్భంగా మైదానంలోని ఫ్లడ్‌లైట్లు వెలుగక ఆటకు అంతరాయం కలిగిన ఘటనను ఒడిశా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి పదిరోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ)కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
‘ఫ్లడ్‌లైట్లు ఎందుకు వెలుగలేదు? దీని వెనుక బాధ్యులు వ్యక్తులా లేక ఏజెన్సీనా? భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోబోయే జాగ్రత్తలు ఏంటి?’ వంటి విషయాలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 6.1 ఓవర్లో ఫ్లడ్‌లైట్లు ఆగిపోయి సుమారు 35 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. దీంతో ఆటగాళ్లు పెవిలియన్ చేరగా, ప్రేక్షకులు చాలా ఇబ్బందిపడ్డారు.