లండన్: క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. 142 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన ఈ ‘క్రికెట్ మక్కా’లో తొలిసారి మహిళా జట్లు టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాయి. మెన్స్ క్రికెట్లో 150 టెస్టులకు ఆతిథ్యమిచ్చి ఆటలో ఎందరో దిగ్గజ ఆటగాళ్ల విన్యాసాలకు సాక్ష్యంగా నిలిచిన లార్డ్స్.. మొట్టమొదటిసారి అమ్మాయిల టెస్టులకు ఆతిథ్యమివ్వనున్నది. టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన భారత్, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నుంచి ఇంకా తేరుకోని ఇంగ్లండ్.. శుక్రవారం మొదలయ్యే ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. రెడ్‌బాల్ క్రికెట్లో ఇంగ్లిష్ జట్టుపై మెరుగైన రికార్డు ఉన్న ఉమెన్ ఇన్ బ్లూ.. ఆతిథ్య జట్టును ఎలా ఎదుర్కుంటుదనేది ఆసక్తికరం.
ఇంగ్లండ్‌తో టెస్టుల్లో భారత్‌దే సంపూర్ణ ఆధిపత్యం. ఇరుజట్ల మధ్య జరిగిన 15 టెస్టుల్లో టీమిండియా ఓడింది ఒక్కటే ఒక్క మ్యాచ్‌లో. మూడింట్లో గెలిచి 11 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఇంగ్లిష్ గడ్డపై అయితే 1995 నుంచి భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇరుజట్ల మధ్య చివరిసారిగా 2023లో నవీ ముంబై వేదికగా జరిగిన టెస్టులో హర్మన్‌ప్రీత్ సేన ఏకంగా 347 పరుగుల భారీ తేడాతో గెలిచింది. సుమారు నెల రోజులుగా ఇంగ్లండ్‌లోనే ఉంటున్న భారత్ అక్కడి పరిస్థితులకు బాగానే అలవాటు పడింది.
టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో నిష్క్రమించాక పూర్తిస్థాయిలో ఈ టెస్టు మీదే దృష్టిసారించిన హర్మన్‌ప్రీత్ టీమ్.. నాట్ సివర్ జట్టుపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నది. ఈ మ్యాచ్‌లో తెలుగమ్మాయి శ్రీచరణితో పాటు హర్లీన్ డియోల్, నందిని శర్మ అరంగేట్రం చేయనున్నారు. ఇంగ్లండ్ నుంచి అలీస్ క్యాప్సీ, టిల్లి కార్టీన్, మాడీ విలియర్స్, గ్రేస్ పాట్స్, ఎల్లీ త్రెల్కెల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంగ్లిష్ ఓపెనర్ టామీ బ్యూమంట్కు ఇదే ఆఖరి టెస్టు కావడం గమనార్హం.