ODI WC 2023 : ఈ ఏడాది వరల్డ్ కప్(ODI World Cup 2023) పోటీలకు అతిథ్యం ఇస్తున్న ప్రతిష్ఠాత్మకమైన ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) స్టేడియంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. కోల్కతాలోని ఈ గ్రౌండ్ డ్రెస్సింగ్ రూమ్(Dressing Room)లో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పాటు ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
క్రికెటర్లు వస్తువులు దాచుకునే ఫాల్స్ సీలింగ్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడే పని చేస్తున్నవాళ్లు ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు. షార్ట్ సర్క్యూట్(short circuit) కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మరో రెండు నెలల్లోనే వరల్డ్ కప్ మొదల్వనుంది. దాంతో, ఈ స్టేడియం సుందరీకరణ, మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈడెన్ గార్డెన్స్ (కోల్కతా)
సెప్టెంబర్ 15లోపు స్టేడియాన్ని పూర్తిగా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమధ్యే ఐసీసీ భద్రతా బృందం(ICC Safety Pannel) ఈ మైదానంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. మరో నెల రోజుల తర్వాత మళ్లీ ఆ టీమ్ తనిఖీలకు రానుంది. ఈ సమయంలో ఇలా జరగడం ఈడెన్స్ గార్డెన్ నిర్వహణపై పలు ప్రశ్నలకు తావిస్తోంది.
అక్టోబర్ 5న వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈడెన్ గార్డెన్స్ ఐదు మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 28న క్వాలిఫయర్ 1, బంగ్లాదేశ్, అక్టోబర్ 31న పాకిస్థాన్, బంగ్లాదేశ్, నవంబర్ 5న భారత్, దక్షిణాఫ్రికా, నవంబర్ 12న ఇంగ్లండ్, పాకిస్థాన్, నవంబర్ 16న సెమీఫైనల్ 2 మ్యాచ్లు ఇక్కడ జరుగనున్నాయి.