ODI World Cup 2023 : క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే భారత గడ్డపై వన్డే ప్రపంచ కప్ రసవత్తరంగా సాగుతోంది. తమ ఫేవరేట్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలను కళ్లారా చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. దాంతో, వరల్డ్ కప్ టికెట్లకు రెక్కలొచ్చాయి. ‘బుక్‌మైషో'(bookmyshow) వెబ్సైట్లో భారత జట్టు మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.
ఇదే అదనుగా కోల్‌కతాలో కొందరు వరల్డ్ కప్ టికెట్లను భారీ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేసి.. బ్లాక్ మార్కెట్లో అమ్మడం మొదలు పెట్టారు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన అభిమానులు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(cricket association of bengal), బుక్‌మైషో వెబ్‌సైట్‌పై అక్కడి మైదాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ప్రపంచ కప్ మొదట్లో ఏకపక్ష మ్యాచ్‌లతో చప్పగా అనిపించినా.. ఆ తర్వాత ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు థ్రిల్నిచ్చాయి. జోరు మీదున్న దక్షణాఫ్రికా, భారత్ ఇప్పటికే సెమీస్బెర్తులో ముందుండగా.. మిగతా రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మధ్య పోటీ నెలకొంది.