టెస్టు క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొస్తూ అభిమానులను మునివేళ్లపై కూర్చోబెడుతున్న అండర్సన్- టెండూల్కర్ సిరీస్ ముగింపు దశకు చేరింది. భారత్, ఇంగ్లండ్ మధ్య హోరాహోరీగా సాగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఓవల్ వేదికగా చివరి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 1-2తో వెనుకబడ్డ టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి 2-2తో సిరీస్ సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుండగా ఓవల్‌లో సిరీస్‌ను చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఆతిథ్య జట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఓవల్: సుమారు నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న అండర్సన్-టెండూల్కర్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ చివరి అంకానికి చేరింది. భారత్, ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక ‘ది ఓవల్’ మైదానంలో గురువారం నుంచి సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు జరుగనుంది. సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడ్డ టీమ్ఇండియా.. ఓవల్‌లో గెలిచి 2-2తో సమం చేయాలని భావిస్తున్నది. ఇటీవలే మాంచెస్టర్‌లో ముగిసిన నాలుగో టెస్టులో అసమాన పోరాటంతో మ్యాచ్‌ను ఓటమి నుంచి కాపాడుకున్న భారత్.. లెక్క సరిచేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1తో గెలుచుకోవాలని ఆతిథ్య జట్టు ప్రణాళికలు రచించింది. కానీ కీలక టెస్టుకు ముందు ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లను కోల్పోవడం ఇంగ్లిష్ అభిమానులను కలవరపరుస్తున్నది. గాయంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా మరో మూడు మార్పులతో ఇంగ్లండ్ బరిలో ఉంది.
మాంచెస్టర్‌లో అద్భుత పోరాటంతో సిరీస్ ఆశలు నిలుపుకున్న గిల్ సేన.. ఓవల్‌లో తప్పక నెగ్గాల్సిన స్థితి నెలకొంది. ఈ మ్యాచ్‌ను ఓడినా, డ్రా చేసుకున్నా సిరీస్ పోయినట్టే! ఈ నేపథ్యంలో కీలక పోరుకు తుది జట్టు విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతున్నది. బ్యాటింగ్ విషయంలో భారత్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టాపార్డర్‌లో సుదర్శన్ మినహా జైస్వాల్, రాహుల్, గిల్ టాప్ ఫామ్‌లో ఉన్నారు. నాలుగో టెస్టులో గాయపడ్డ రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడనున్నాడు. జడేజా, వాషింగ్టన్ రూపంలో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది.
బౌలింగ్.. మరీ ముఖ్యంగా పేస్ విభాగంలోనే పర్యాటక జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వర్క్‌లోడ్ పరంగా బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఆకాశ్ దీప్‌ను ఆడించే అవకాశాలున్నాయి. దీంతో భారత పేస్ విభాగానికి సిరాజ్ నాయకత్వం వహిస్తాడు. మూడో పేసర్‌గా అన్శుల్ స్థానంలో అర్ష్‌దీప్ టెస్టు అరంగేట్రం చేసే అవకాశముంది. కుల్దీప్‌నకు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. ఈ సిరీస్‌లో విఫలమవుతున్నప్పటికీ ఆల్‌రౌండర్ కోటాలో శార్దూల్‌ను ఆడించక తప్పని పరిస్థితి. ఒకవేళ శార్దూల్‌ను తప్పిస్తే కుల్దీప్ ఆడే అవకాశం దక్కుతుంది.
ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ నాలుగు మార్పులతో ఆడబోతున్నది. కుడి భుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ ఇద్దరితో పాటు స్పిన్నర్ డాసన్, మరో పేసర్ బ్రైడెన్ కార్స్కూ విశ్రాంతినిచ్చిన ఇంగ్లండ్.. వారి స్థానాల్లో జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జెమీ ఒవర్టన్‌ను చేర్చింది. స్టోక్స్ గైర్హాజరీలో ఒలీ పోప్ ఆ జట్టును నడిపించనున్నాడు. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన (నాలుగు టెస్టుల్లో 304 రన్స్, 17 వికెట్లు)తో అదరగొడుతున్న స్టోక్స్ లేకపోవడం ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ. ఆ జట్టులో ఫ్రంట్‌లైన్ పేసర్లు క్రిస్ వోక్స్, ఆర్చర్, కార్స్ కంటే ఇంగ్లండ్.. గత నాలుగు టెస్టుల్లో స్టోక్స్ మీదే ఎక్కువగా ఆధారపడింది. అతడు లేకపోవడం ఆ జట్టును మానసికంగా దెబ్బతీసేదే కాగా భారత జట్టు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరం!
భారత్ (అంచనా): జైస్వాల్, రాహుల్, సుదర్శన్, గిల్ (కెప్టెన్), వాషింగ్టన్, జడేజా, జురెల్, శార్దూల్, ఆకాశ్, సిరాజ్, ప్రసిద్ధ్/అర్ష్‌దీప్ ఇంగ్లండ్: క్రాలీ, డకెట్, పోప్ (కెప్టెన్), రూట్, బ్రూక్, బెథెల్, స్మిత్, వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్