భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సుస్థిరం చేసుకునేందుకు భారత్ కీలక మ్యాచ్‌లకు సిద్ధమైంది. డబుల్ హెడర్‌లో భాగంగా గురు, శుక్రవారాల్లో జర్మనీతో భారత పురుషుల హాకీ జట్టు తలపడనుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన భారత్ 21 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జర్మనీని అమిత్ రోహిదాస్ బృందం ఢీ కొట్టనుంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా తమ అనుభవాన్నంతా రంగరించి ప్రత్యర్థిని చిత్తు చేయాలనే యోచనలో ఉంది. ప్రత్యర్థి ఎవరైనా సరే అత్యుత్తమ ప్రదర్శన చేయడమే భారత్ విజయసూత్రం.
అదే వ్యూహాన్ని ఈ రెండు మ్యాచ్‌ల్లో అమలు చేసేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ల్లో కొన్ని ప్రయోగాలు చేసే అవకాశం కూడా ఉంది. ‘ప్రత్యర్థి ఎవరనేది మాకు ముఖ్యం కాదు. జట్టుగా మెరుగైన ప్రదర్శన చేయడంపైనే మా దృష్టి ఉంటుంది. అత్యుత్తమ ప్రదర్శన చేసి తామేంటో నిరూపించుకోవాలని కుర్రాళ్లు భావిస్తున్నారు’ అని వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. ప్రపంచకప్, పారిస్(2024) ఒలింపిక్స్ కోసం జర్మనీ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నది. ఈ సందర్భంగా భారత్‌తో పోరుకు ప్రయోగాత్మకంగా జూనియర్లను రంగంలోకి దింపాలని భావిస్తున్నది.