న్యూఢిల్లీ: బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన ట్రావెల్ పాలసీ అమలులోకి రానున్నది. చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)తో ఆ రూల్‌ను అమలు పరచనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా జట్టు దుబాయ్ వెళ్లనున్నది. అయితే టీమిండియా ప్లేయర్లతో కుటుంబాలు వెళ్లేందుకు అనుమతించలేదు. ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో ఇండియా తొలి మ్యాచ్ ఆడనున్నది. ఆ తర్వాత 23వ తేదీన పాకిస్థాన్‌తో తలపడనున్నది. మార్చి 2వ తేదీన కివీస్‌తో మ్యాచ్ ఉంటుంది. రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడనున్నది. కానీ టోర్నీకి చెందిన మిగితా మ్యాచ్‌లు అన్నీ పాకిస్థాన్‌లో జరగనున్నాయి.
టోర్నమెంట్ డ్యూరేషన్ కేవలం మూడు వారాలు మాత్రమే ఉండడం వల్ల .. ప్లేయర్లతో ఫ్యామిలీ వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించడం లేదు. కొత్త పాలసీ ప్రకారం ఒకవేళ విదేశీ టూర్ 45 రోజులు ఉంటే, దాంట్లో రెండు వారాల పాటు ప్లేయర్లతో ఉండేందుకు కుటుంబసభ్యులకు అనుమతి కల్పిస్తారు. ఒకవేళ టూర్ షెడ్యూల్లో ఏదైనా మార్పు జరిగితే, అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఆటగాళ్లు తమ భార్యలు కానీ, పిల్లలు, కానీ భాగస్వామ్యుల్ని తీసుకెళ్లాలనుకుంటే బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్త ట్రావెల్ పాలసీ ప్రకారం ఖర్చులు ప్లేయర్లే భరించాల్సి ఉంటుంది.
చాంపియన్స్ ట్రోఫీ కోసం వెళ్లే ఆటగాళ్లు మళ్లీ నెల రోజుల్లోనే తిరిగి రానున్న నేపథ్యంలో.. ప్లేయర్లతో కుటుంబీకులు వెళ్లే ఛాన్సు లేదని బీసీసీఐ చెప్పింది. ఒకవేళ విజిటర్స్ సమయం దాటితే, అప్పుడు అయ్యే ఖర్చులతో బీసీసీకి సంబంధం ఉండదు. ఇక జూలై-ఆగస్టులో ఇంగ్లండ్‌లో జరిగే అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం వెళ్లే ప్లేయర్లతో ఫ్యామిలీ సభ్యుల్ని అనుమతించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. రెండు వారాల పాటు కుటుంబీకులకు క్రికెటర్లతో స్టే చేసే అవకాశం కల్పించనున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు దారుణంగా విఫలం కావడంతో.. కొత్త ట్రావెల్ పాలసీని రూపొందించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య సమన్వయం, క్రమశిక్షణ లోపించినట్లు గుర్తించారు.