ఇస్తాంబుల్: వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలోనూ భారత రెజ్లర్ల వైఫల్య ప్రదర్శన కొనసాగింది. పారిస్ ఒలింపిక్స్ బెర్తులను నిర్ణయించే ఈ టోర్నీలో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం బరిలోకి దిగిన ఇద్దరు ఫ్రీస్టయిల్ రెజ్లరూ ఓడారు. పురుషుల 65 కిలోల విభాగం కాంస్య పోరులో సుజీత్.. జైన్ అలెన్ చేతిలో ఓడాడు. 74 కిలోల రెపీచెజ్ రౌండ్లో జైదీప్.. అర్సలన్ (టర్కీ)కు తలవంచాడు. కొద్దిరోజుల క్రితమే బిష్కెక్ వేదికగా ముగిసిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో చేతులెత్తేసిన మన మల్ల యోధులు.. ఈ టోర్నీలోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించారు. నిషా దహియా (68 కిలోలు), అమన్ సెహ్రవత్ (57 కిలోలు) మాత్రమే రాణించారు. ఈ ఇద్దరితో పాటు ఇప్పటివరకు వినేశ్ పొగాట్, అంతిమ్ పంఘల్, అన్షు మాలిక్, రీతికా హుడా ఒలింపిక్ బెర్తులు దక్కించుకున్నారు.