పొట్టి ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్‌పై ఉత్కంఠ భరిత విజయం.. దైపాక్షిక సిరీస్‌ల్లో అద్వితీయ
విజయాలు.. రూ.48 వేల కోట్ల ఐపీఎల్ మీడియా హక్కుల వేలం.. సెలెక్షన్ కమిటీపై వేటు.. బీసీసీఐ కొత్త బాస్ ఎన్నిక.. ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్‌లో నిరాశజనక ప్రదర్శన ఇలా ఈ ఏడాది క్రికెట్లో భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరోసారి కలగానే మిగిలిపోగా.. కోహ్లీ నుంచి రోహిత్ పూర్తి స్థాయిలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. 2022లో టీమ్ఇండియా ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిస్తే..
న్యూఢిల్లీ: క్రికెట్‌ను మతంగా భావించే దేశంలో.. మెగా ట్రోఫీ లేకుండానే టీమ్ఇండియా మరో ఏడాదిని ముగించింది. తీరిక లేని క్రికెట్ ఆడుతూ విశ్వవ్యాప్తంగా తగినంత గుర్తింపు దక్కించుకున్న భారత్.. ఐసీసీ మెగాటోర్నీలైన టీ20 ప్రపంచకప్, ఆసియాకప్‌లో నిరాశ పరిచింది. యూఏఈ వేదికగా జరిగిన ఆసియాకప్‌లో ఫైనల్ చేరకుండానే వెనుదిరిగిన భారత్.. ఆసీస్ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన పోరులో విరాట్ కోహ్లీ కండ్లు చెదిరే సిక్సర్లతో జట్టును ముందుకు నడిపినా.. ఆ తర్వాత అదే జోరు కనబర్చడంలో విఫలమైన భారత్.. రిక్తహస్తాలతోనే మెగాటోర్నీని ముగించింది. ఈ ఏడాది ఐపీఎల్ మీడియా హక్కులు రూ.48 వేల కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించగా.. మైదానంలో మాత్రం మనవాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. 2022 ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమి పాలవగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలో రోహిత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టగా.. ఏడాది ముగిసే సమయానికి హార్దిక్ పాండ్యా టీ20 పగ్గాలందుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో ప్రక్షాళనకు పూనుకున్న మేనేజ్మెంట్.. వన్డేల్లో కూడా దూకుడైన నిర్ణయాలతో ముందుకు సాగితేనే మనవాళ్లకు కొత్త ఏడాది కలిసిరానుంది.
ఫార్మాట్లతో సంబంధం లేకుండా బాదుడే పరమావధిగా ఇంగ్లండ్ విజయాలు సాధిస్తూ ఉంటే.. మనవాళ్లు మాత్రం టీ20ల్లో సైతం టెస్టు తరహా ఇన్నింగ్స్‌లతో నిరాశ పరిచారు. దైపాక్షిక సిరీస్‌ల్లో ఫర్వాలేదనిపించిన భారత్.. ఐసీసీ మెగాటోర్నీల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాదాపు మూడేం డ్ల విరామం తర్వాత ఈ ఏడు విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు సాధించగా.. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ వన్డేల్లో రికార్డు డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో జట్టు ఎంపికపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అంతకుముందు మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఆటగాడికి తుది జట్టులో చోటు కల్పించకుండా.. పుష్కర కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌ను తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా తనదైన ముద్ర వేయలేకపోగా.. ప్రధాన ఆటగాళ్లను గాయాల బెడద వెంటాడింది. ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ రూపం లో ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ముద్ర వేయగా.. టీ20 వరల్డ్ కప్‌నకు జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీపై వేటు పడింది. బీసీసీఐ కొత్త బాస్‌గా రోజర్ బిన్నీ ఎంపిక కాగా.. మహిళల క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి కెరీర్‌కు వీడ్కోలు పలికారు.