Foot Ball | హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలోని జీఎంసీ బాలయోగి స్టేడియం మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. ఈ నెల 3 నుంచి 9 దాకా హైదరాబాద్ వేదికగా భారత్, మారిషస్, సిరియా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్-2024 ఆడనున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) సమన్వయంతో ఈ టోర్నీని నిర్వహించనున్నాయి.
ఫుట్‌బాల్‌లో హైదరాబాద్ నగరానికి ఉన్న ఘనమైన వారసత్వం దృష్ట్యా మళ్లీ ఈ క్రీడలో పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే. శివసేనారెడ్డి అన్నారు. ఈ టోర్నీని సజావుగా నిర్వహించేందుకు స్టేడియంలో అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసినట్టు ఆయన తెలిపారు. టోర్నీలో భాగంగా భారత్.. ఈనెల 3న మారిషస్‌తో 9న సిరియాతో తలపడనుంది. మారిషస్, సిరియా మధ్య 6న మ్యాచ్ జరుగనుంది.