టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్య
లండన్: కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలని ప్రయత్నించినా.. కొంతమంది మాత్రం తాను విఫలం కావాలని కాచుకుని కూచునేవారని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇటీవల కోచింగ్ బాధ్యతలకు దూరమైన రవిశాస్త్రి.. తన పదవీ కాలంలో ఎదురైన అనుభవాలను ఓ అంతర్జాతీయ పత్రికతో పంచుకున్నాడు. 2014 నుంచి 2021 వరకు ఒక్క ఏడాది మినహా దాదాపు ఆరేండ్లు టీమ్ఇండియా కోచ్గా వ్యవహరించిన రవిశాస్త్రి.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాజీ డైరెక్టర్ రాబర్ట్ కీ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నాడు.
‘ఈర్ష్యతో ఉన్నవాళ్లను ఎదుర్కోవాలంటే మన చర్మం మందంగా ఉండాలి. అది డ్యూక్ బాల్ కంటే గట్టిగా ఉండాలని రాబర్ట్ చెప్పేవాడు. రాబర్ట్ ఇంగ్లండ్ బోర్డు డైరెక్టర్గా వ్యవహరించినప్పుడు ఇలాంటివి అనుభవించాడు. నాకు కూడా భారత్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీమ్ఇండియా కోచ్గా పనిచేసే కాలంలో నేను ఎప్పుడు విఫలమవుతానా.. అని కొంతమంది కోరుకునేవారు. అయినా నేను వదిలే రకం కాదు’అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.