TDCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందాలంటే ప్రతి జిల్లాకూ అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన అకాడమీలు అవసరమని, రాష్ట్ర జట్టు అంటే అన్ని జిల్లాల నుంచి క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఉండాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘తెలంగాణ క్రికెట్ దశ-దిశ’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామీణ క్రికెట్ సరైన ఆదరణను నోచుకోలేదని, రాష్ట్ర క్రికెట్ జట్టు అంటే ప్రతి జిల్లాకూ ప్రాతినిధ్యం ఉండేలా టీడీసీఏ తరఫున రాజీలేని కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాట్ చైర్మన్ కే. శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో గ్రామీణ క్రికెట్ కుంటుపడింది. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి టీడీసీఏ సంకల్పం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం’ అని అన్నారు.