టెస్టు క్రికెట్లో ఒక శకం ముగిసింది. కానీ కోహ్లీ వారసత్వం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. టీమ్ఇండియాకు అతడు అందించిన సేవలు మరువలేనివి
– బీసీసీఐ
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : 2014లో టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది. అటువైపు భయమెరుగని మహామహులు. ఇటుచూస్తే దశాబ్దాల పాటు టీమిండియాను కాచుకున్న సచిన్, లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ లాంటి యోధానుయోధులు ఇక చాలని పోరు చాలించారు. ధోని అందుబాటులో లేడు. 70 ఏండ్లుగా జరుగుతున్న పోరాటంలో సిరీస్ గెలుపు తలుపు తట్టని భారత్‌ను చూసి కంగారూలు విర్రవీగుతున్నారు.
అలాంటి పరిస్థితుల్లో భారత భారాన్ని తన భుజాలపై వేసుకున్న నూనుగు మీసాల కుర్రాడు విరాట్ కోహ్లీ కదనరంగంలోకి దూకాడు. ఒక పట్టాన ఓటమిని అంగీకరించని ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టించాడు. మహాభారతంలో అభిమన్యుడిలాగానే పరాక్రమం చూపుతూ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 115 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 141 పరుగులు చేసి, చివరి వరకు పోరాడి ఆస్ట్రేలియాకు ఓటమి భయాన్ని పరిచయం చేశాడు.
మ్యాచ్ ఓడిపోయినా ఇండియాకు మాత్రం గెలుపును రుచి చూపించి తన కెప్టెన్సీ ప్రస్థానాన్ని ఘనంగా చాటిచెప్పాడు. తాము డ్రాల కోసం రాలేదని, చావోరేవో తేల్చుకునేందుకు వచ్చామని చెప్పి, సరికొత్త టీమిండియాను ప్రపంచానికి పరిచయం చేశాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్టుగా జట్టును తయారు చేశాడు. మాటల్లోనే కాదు, చేతల్లోనూ చేసి చూపించాడు. అలా అతి తక్కువ కాలంలోనే టీమిండియాను మళ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానానికి తీసుకెళ్లాడు.
‘సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) కంట్రీస్’ కంచుకోటలను బద్దలు కొట్టాడు. 70 ఏండ్లుగా ఆస్ట్రేలియాలో కొరకరాని కొయ్యగా మారిన సిరీస్ విజయాన్ని 2018లో సాధించి చూపెట్టాడు. ఐసీసీ తొలి టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. 2017 నుంచి 2021 వరకు భారత్ టెస్టు గదను ముద్దాడేలా చేశాడు. తన టెస్ట్ కెరీర్లో మొత్తం 68 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన విరాట్.. 40 మ్యాచులు గెలిపించి, సాటిలేని మేటి కెప్టెన్‌గా ఎదిగాడు. టెస్టులనూ టీవీలకు అతుక్కొని చూసేలా చేశాడు.
బాధ్యతలు పెరిగితే చాలామంది ఒత్తిడికి చిత్తవుతారు. కెప్టెన్సీ భారాన్ని మోయలేక చతికిలపడతారు. కానీ, విరాట్ కోహ్లీ అందుకు అతీతుడు. నిప్పుల కొలిమిలో కాలినప్పుడే బంగారం మెరిసినట్టు ఒత్తిడిలోనే విరాట్ బెస్ట్ బయటికి వస్తుంది. ప్లేయర్‌గా 55 టెస్టు మ్యాచులు ఆడిన విరాట్.. 37.40 సగటుతో 3,366 పరుగులు చేశాడు. టీమిండియా సారథిగా 68 టెస్టులాడి.. 54.80 సగటుతో 5,864 పరుగులు చేశాడు. మొత్తంగా 123 మ్యాచ్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. మొత్తం 30 సెంచరీలు, 61 అర్ధ శతకాలు చేశాడు. టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా 2018, 2019లో, క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా 2017, 2018లో నిలిచాడు.
విరాట్ ఒక అసాధ్యుడు. భారతంలో భీముడిలా అగ్రెసివ్‌గా ఆడగలడు. అర్జునుడిలా సంగ్రామాన్ని ఒక్కడే నడిపించగలడు. ధర్మరాజులా లౌక్యంతోనూ, నకులసహదేవుల్లా యాంకర్ పాత్రనూ పోషించగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అతనొక పంచ పాండవుల మేలు కలయిక.. రాజ్యం లేని రారాజు. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచాక టీమిండియా భారాన్ని విరాట్‌పై మోపి సచిన్ నిష్క్రమించిన నాటినుంచీ.. టీమ్ భారాన్ని మోస్తున్న యోధుడు. ఇప్పుడు తనపైనున్న భారాన్ని ఒక్కొక్కటిగా దించుకుంటూ మనల్ని బాధలో ముంచెత్తుతున్నాడు. యోధుడా.. మా నాయకా.. నీకు సలాం..
సింహం లాంటి దూకుడుతనం అతని సొంతం. చీక్స్ మేము నిన్ను మిస్సవుతున్నాం.
– గౌతం గంభీర్
టెస్టు కెరీర్‌కు నువ్వు వీడ్కోలు పలుకడాన్ని నమ్మలేకపోతున్నాను. ప్రస్తుత యుగానికి దిగ్గజ క్రికెటర్వు, టెస్టు మ్యాచ్ క్రికెట్‌కు అద్భుతమైన బ్రాండ్ అంబాసీడర్. నీ ఆటతో లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు అందరికీ. నాకు మరీ ప్రత్యేకంగా, అది జీవితాంతం గుర్తుంచుకుంటాను. గో వెల్ చాంప్. గాడ్ బ్లెస్ యూ.
– రవిశాస్త్రి,మాజీ చీఫ్ కోచ్
దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి నీ ఆటతీరుతో ఆదర్శంగా నిలిచావు. నీదో అద్భుతమైన టెస్టు కెరీర్. కేవలం పరుగులు సాధించడం ద్వారానే కాకుండా క్రికెట్ పట్ల అమితాసక్తి ఉన్న అభిమానులు, క్రికెటర్లతో కూడిన కొత్త జనరేషన్‌కు మూలంగా నిలిచావు. నీ ప్రత్యేకమైన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు సందర్భంగా అభినందనలు.
– సచిన్ టెండూల్కర్
విరాట్ కోహ్లీ అద్భుతమైన టెస్టు క్రికెట్ ప్రయాణం ముగిసింది. నీ నిబద్ధత, నాయకత్వ శైలితో భారత క్రికెట్‌కు కొత్త నిర్వచనాన్ని అందిచావు. టెస్టుల్లో మరిచిపోలేని జ్ఞాపకాలు అందించినందుకు కృతజ్ఞతలు. వన్డేల్లో మీ విజయయాత్ర కొనసాగాలని ఆశిస్తున్నాను.
– హరీశ్‌రావు, మాజీ మంత్రి
భారత్ తరఫున టెస్టులలో అత్యధిక పరుగుల వీరులు
సచిన్ : 15,921
ద్రావిడ్ : 13, 265
గవాస్కర్ : 10,122
కోహ్లీ : 9,230
మూడు ఫార్మాట్లలో కలిపి..
సచిన్ : 34,357
కోహ్లీ : 27,599
ద్రావిడ్ : 24,064
రోహిత్ : 19,700